పోలవరంకు అరువివ్వండి : కేంద్ర మంత్రి గడ్కరి విజ్ఞప్తి

SMTV Desk 2017-12-20 12:33:02  polavaram, nitin gadkari, credit, cement, steel

న్యూ డిల్లీ, డిసెంబర్ 20 : కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గడ్కరి తన కార్యాలయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, సిమెంట్‌, స్టీల్‌ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ హామీతో పోలవరం ప్రాజెక్టులో కాంక్రీట్‌ పనులు చేస్తున్న ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థకు.. 90 రోజుల అరువు ప్రాతిపదికన సిమెంటు, స్టీల్‌ సరఫరా చేయాలని మంత్రి ఆయా కంపెనీల వారికి సూచించారు. ఈ అంశంపై స్టీల్‌ అథారిటీలో మాట్లాడి చెబుతామని ఆ కంపెనీల ప్రతినిధులు చెప్పగా, సిమెంట్‌ వాళ్లు మాత్రం నెలరోజుల వరకే ఆగగలమని రెండు రోజుల్లో తమ విధానం చెబుతామని గడ్కరీకి చెప్పినట్లు సమాచారం. సమావేశానంతరం ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. గత వారం గడ్కరి, ముఖ్యమంత్రి భేటీ తర్వాత పనుల్లో కొంత పురోగతి ఉందని చెప్పారు. ప్రస్తుతం అగ్రిగేట్‌ కూలింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటుకోసం ఒక ప్లాంట్‌ తాత్కాలికంగా మూశారని, దానివల్ల పురోగతిలో కొంత ఇబ్బంది ఉంటుందన్నారు. కూలింగ్‌ప్లాంట్‌ ఏర్పాటు పూర్తయిన తర్వాత వేగం పెరుగుతుందని పేర్కొన్నారు. 27కల్లా ప్లాంట్‌ ఏర్పాటు పూర్తవుతుంది. కాబట్టి ఆ తర్వాత పనులు వేగం పుంజుకుంటాయని భావిస్తున్నట్లు చెప్పారు. కాగా మంత్రి పోలవరం పర్యటన వాయిదాపడింది.