జీవించే హక్కును కాలరాయవద్దు: హైకోర్టు హెచ్చరిక

SMTV Desk 2017-12-20 11:38:16  high court, ap, food, poison, comments

హైదరాబాద్, డిసెంబర్ 20: తెలుగు రాష్టాల్లో విచ్చలవిడిగా జరుగుతున్న ఆహార కల్తీలపై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పాలు, పప్పులు, బియ్యం ఇలా అన్నీ కల్తీలే.. పండ్లను రసాయనాలతో మగ్గిస్తున్నారు.. ప్రజలకు ఏది కల్తీయో తెలియక విధిలేని పరిస్థితుల్లో విషాహారం తీసుకుంటున్నారు. ఏడాదికోసారి తనిఖీలు నిర్వహిస్తే ఫలితం ఎలా వస్తుంది? కల్తీ నివారణకు అధికారుల్లో చిత్తశుద్ధి లేదు. వ్యాపారులకు లాభాపేక్ష తప్ప ప్రజారోగ్యం పట్టదు. ప్రజల జీవించే హక్కును కాలరాస్తున్నారు. కల్తీల నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అంటూ కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. కల్తీల నివారణకు కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసి తమ ముందుంచాలని మంగళవారం రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. ఆహార పదార్థాల కల్తీపై సరైన నిఘా ఉండటం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. అప్పుడప్పుడూ తనిఖీలు నిర్వహించినా వ్యాపారులను కఠినంగా శిక్షించే యంత్రాంగం లేకపోవడంతోనే కల్తీ విచ్చలవిడిగా కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తదుపరి విచారణను 23వ తేదీకి వాయిదా వేసింది.