విదేశాలకు వలస వెళ్ళే జాబితాలో భారత్ కు అగ్రస్థానం..!

SMTV Desk 2017-12-19 15:46:23  migrations, international, un, india, first place

వాషింగ్టన్, డిసెంబర్ 19 : విదేశాల్లో భారతీయులు దాదాపు 17 మిలియన్ల మంది నివసిస్తున్నారు. విదేశాల్లో నివసిస్తున్న వలసదారుల జాబితాల్లో భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఒక్క గల్ఫ్‌ దేశంలోనే 5 మిలియన్ల మంది భారతీయులు నివసిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. 2017 ఇంటర్నేషనల్‌ మైగ్రేషన్‌ పేరిట ఓ నివేదికను యూఎన్‌ మంగళవారం విడుదల చేసింది. తర్వాతి స్థానాల్లో మెక్సికో, రష్యా, చైనా, బంగ్లాదేశ్‌, సిరియా, పాకిస్థాన్‌, ఉక్రెయిన్‌ దేశాలు ఉన్నాయి. 2017 నివేదిక ప్రకారం.. 17 మిలియన్ల మంది భారతీయ వలసదారులు విదేశాల్లో ఉంటున్నారు. మెక్సికో 13 మిలియన్ల మంది వలసదారులతో రెండో స్థానంలో నిలిచింది. రష్యా 11 మిలియన్లు, చైనా 10 మిలియన్లు, బంగ్లాదేశ్‌ 7 మిలియన్లు, సిరియా 7మిలియన్లు, పాకిస్థాన్‌, ఉక్రెయిన్‌ నుంచి 6 మిలియన్ల మంది విదేశాల్లోనే ఉంటున్నారు. భారతీయ వలసదారులు యూఏఈలో 3 మిలియన్ల మంది ఉండగా.. అమెరికా, సౌదీ అరేబియాలో 2 మిలియన్ల మంది ఉన్నారు. 2000 సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఏడాది స్వదేశాల్లో కాకుండా విదేశాల్లో ఉంటున్న వారి సంఖ్య 49శాతం పెరిగింది. దాదాపు 258 మిలియన్ల మంది తమ దేశాల్లో కాకుండా ఇతర దేశాల్లో జీవనం సాగిస్తున్నారు. కొన్ని దేశాల్లో అంతర్జాతీయ వలసలు జనాభా వృద్ధి పెరుగుదలకు దోహదపడుతుంటే.. మరికొన్ని దేశాల్లో మాత్రం జనాభా తిరోగమనానికి కారణమవుతు౦దని ఐరాస పేర్కొంది.