పిటిషన్ల పై రాష్ట్రపతి తిరస్కరణ

SMTV Desk 2017-06-17 15:49:31  President Pranab Mukherjee, Retirement, Mercy petition

న్యూ ఢిల్లీ, జూన్ 17 : భారత దేశ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవి విరమణ చేయటంతో రానున్న నెల రోజుల్లో బాధ్యతల నుంచి దిగిపోతుండగా రాష్ట్రపతి తాజాగా మరో రెండు క్షమాభిక్ష పిటిషన్‌లను తిరస్కరించారు. దీంతో ఇప్పటి వరకు ఆయన వద్దకు తిరస్కరణకు గురైన క్షమాభిక్ష పిటిషన్ల సంఖ్య 30కి చేరింది. తాజాగా తిరస్కరించిన ఈ రెండు పిటిషన్లపై రాష్ట్రపతి ప్రణబ్‌ గత మే నెలాఖరున నిర్ణయం తీసుకున్నారు. 2012లో నాలుగేళ్ల బాలికపై ఇండోర్‌లో ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడి చంపేయగా ఆ కేసుకు సంబంధించి వారికి మరణ శిక్షను కోర్టు విధించింది. అలాగే, పుణెలో ఓ క్యాబ్‌ డ్రైవర్‌ అతడి స్నేహితుడు కలిసి ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడి ఆమెను దారుణంగా హత్య చేశారు. ఈ రెండు కేసులకు సంబంధించిన క్షమాభిక్ష పిటిషన్లు రాష్ట్రపతి వద్దకు గత ఏప్రిల్‌, మే నెలలో చేరాయి. వీటిని రాష్ట్రపతి తిరస్కరించారు. ఈ రెండు కేసులు కూడా అత్యంత అమానవీయ స్థితిలో చోటుచేసుకున్న నేపథ్యంలో వారికి క్షమాభిక్ష పెట్టకూడదని రాష్ట్రపతి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతిగా ప్రణబ్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ముంబయి దాడులకు సంబంధించి అజ్మల్‌ కసబ్‌, అఫ్జల్‌గురు, యాకుబ్‌ మీనన్‌ వంటి కరడుగట్టిన ఉగ్రవాదులకు క్షమాభిక్ష పిటిషన్లు తిరస్కరణకు గురవడంతోపాటు ఉరిశిక్ష కూడా అమలైంది. ఈ ఏడాది జనవరిలో ప్రణబ్‌ ఓ నాలుగు మరణశిక్షలను జీవితకాల శిక్షలుగా కూడా మార్చారు.