హైకోర్టు, అసెంబ్లీ ఆకృతుల ఎంపిక పూర్తి : మంత్రి నారాయణ

SMTV Desk 2017-12-19 12:09:49  amaravati, assembly, high court, shapes, final, narayana

అమరావతి, డిసెంబర్ 19: ప్రతిష్టాత్మక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కట్టడాల ఆకృతుల ఎంపిక పూర్తయిందని మంత్రి నారాయణ తెలిపారు. అసెంబ్లీ, హైకోర్టు భవనాల ఆకృతుల ఎంపిక పూర్తయిందని, ఆరు నుంచి ఎనిమిది వారాల్లోపు తుది ఆకృతులను ఎంపిక చేస్తామని, ఈలోగా సమయం కావాలని నార్మన్‌ఫోస్టర్‌ కంపెనీ కోరిందని మంత్రి తెలిపారు. రాజధానిలో నిర్మిస్తున్న ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారుల నివాస భవనాలు 15 నెలల్లో పూర్తిచేయాలనే లక్ష్యంగా పనులు సాగుతున్నాయని, 1,642 కిలోమీటర్ల పరిధిలో రహదారులను నిర్మిస్తున్నామన్నారు. వెంకటపాలెం-నవులూరు మధ్య నిర్మిస్తున్న రేడియల్‌ యాక్సిస్‌ రోడ్డు ఎన్‌-4ను, కృష్ణాయపాలెం, నవులూరు వద్ద నిర్మిస్తున్న వంతెనల పనులను సోమవారం మంత్రి పరిశీలించారు. 217 చ.కి.మీ.లో సింగపూర్‌ ప్రభుత్వం రూపొందించిన బృహత్‌ప్రణాళిక నమూనాలో 34 మేజర్‌ రహదారులను నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వీధి దీపాలు, తాగునీరు, భూగర్భ నీటిపారుదల తదితర పనులు ప్రారంభమయ్యాయని నారాయణ పేర్కొన్నారు.