అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమే ఈ ధృవీకరణ పత్రం...

SMTV Desk 2017-12-18 18:13:37  birth certificate, harpreeth singh,

చండీఘర్, డిసెంబర్ 18: అధికారులు నిర్లక్ష్యం చేస్తారా..? తెలిసికూడా తప్పు చేస్తారా..? అని అనుమానం వచ్చే వారు, లూదియానకు చెందిన హర్ ప్రీత్ సింగ్ అనే వ్యక్తి జనన ధృవీకరణ పత్రం చూస్తే అర్థమవుతుంది. ఫిబ్రవరి 30న జన్మించినట్లు నమోదు చేసి, సివిల్ సర్జన్ తో పాటు మ‌రో ముగ్గురు వైద్యశాఖ అధికారులు సంతకాలతో ధృవీకరించి జనన ధృవీకరణ పత్రం హర్ ప్రీత్ సింగ్ కు ఇచ్చారు. దీంతో అతను పై చదువులు చదువుకోలే ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. 2012లో చ‌దువు ఆపేసిన హ‌ర్‌ప్రీత్‌, 2015లో ఓపెన్ స్కూల్ ద్వారా ప‌దోత‌ర‌గ‌తి పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ త‌ర్వాత 12వ త‌ర‌గ‌తి చదవడానికి, 2016 డిసెంబ‌ర్ లో బర్త్ సర్టిఫికేట్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకాగా, అందులో తేది తప్పుగా ఉండడం కార‌ణంగా 12వ త‌ర‌గ‌తి చదవలేక పోయాడు. చదువే కాదు తన పనికి కూడా ఈ తప్పిదం పెద్ద తలనొప్పే తెచ్చిపెట్టింది. తోటి యువకుల్లా తను కూడా విదేశాలకు వెళ్లి పని చేసుకోవడానికి పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకోగా, ఈ ధృవీకరణ పత్రం చూసిన అధికారులు తనకు పాస్ పోర్ట్ కూడా జారీ చేయలేదు. ఇలా ప్రభుత్వ అధికారులు చేసే తప్పిదాలు సామాన్యుల పాలిట గుదిబండగా మారుతున్నాయి. ఇలాంటి సంఘటనలు పునఃరావృతం కాకుండా చూసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.