గుజరాత్ ఎన్నికల్లో ఓడి గెలిచిన కాంగ్రెస్...

SMTV Desk 2017-12-18 17:43:31  gujarat, elections, congres, moral win, bjp

అహ్మదాబాద్, డిసెంబర్ 18: తీవ్ర ఉత్కంఠ నడుమ గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీని విజయం వరించినా, కాంగ్రెస్‌ నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైంది. హోరాహోరీ పోరులో బీజేపీ గట్టెక్కినా ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో విపక్షం నుంచి గట్టి పోటీ ఎదురై వంద సీట్లు దాటేందుకు కష్టపడింది. దీ౦తో గుజరాత్ ఎన్నికల్లో నైతిక విజయం మాదేనని కాంగ్రెస్ ప్రకటించింది. మొదట బీజేపీ నేతలు ప్రకటించిన 150 సీట్లు కాదుకదా, కనీసం వంద సీట్ల మార్కుని కూడా ఆ పార్టీ దాటలేకపోయింది. సర్వేలు అన్ని బీజేపీ ఎక్కువ సీట్లను కైవసం చేసుకుంటుందని తెలిపినా, ఓటరు నాడి గుర్తించలేకపోయాయి. అధికార బీజేపి నేతలు విజయ గర్వం ప్రదర్శిస్తున్నా, కాంగ్రెస్ పు౦జుకు౦దనే ఆందోళన కనబడుతుంది. గుజరాత్ రాష్ట్రంలో రెండు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ అధికారానికి దూరంగా ఉండడంతో ఈ సారి ఖచ్చితంగా గెలుస్తామని ఆ పార్టీ నమ్మింది. దీనికి తోడు గుజరాత్ లో కుల ఉద్యమ నాయకులు హార్దిక్, జిగ్నేష్, అల్ఫేష్ ల మద్దతుతో ఎన్నికలకు వెళ్ళింది. రాహుల్‌ ప్రచారం సాగించిన తీరు కూడా ఆ పార్టీలో ఆశలు రేకెత్తి౦చాయి. గతంలో కంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓట్లు, సీట్లు పెరిగాయి. తుదివరకు పోరాడి, బలమైన బీజేపీకి గట్టి పోటీ ఇచ్చి కొద్ది తేడాతో అధికార పీఠాన్ని కోల్పోయిన కాంగ్రెస్ ఓడినా నైతికంగా గెలిచినట్లేనని రాజకీయ విశ్లేషకుల భావన.