అలసిన చేతులకు వ్యాయామం...

SMTV Desk 2017-12-18 17:19:49  hand Exercise, health tips,

హైదరాబాద్, డిసెంబర్ 18: ప్రస్తుత కాలంలో ప్రతీ ఒక్కరు శరీరానికి శ్రమ తగ్గించి చేతులకూ, మణికట్టుకు మాత్రం పని పెంచారు. నేటి తరం యువత నుంచి వృద్ధుల వరకు అందరి చేతులు కీ బోర్డ్ పైనే. దీంతో నేడు ఎంతోమంది రకరకాల చేతినొప్పులు, వేళ్ల నొప్పులు, మణికట్టు నొప్పులతో బాధపడుతున్నారు. చేతులను, వేళ్లను ఒక క్రమపద్ధతిలో కదిలిస్తూ రోజు మొత్తమ్మీద రెండుమూడు సార్లు తేలికపాటి వ్యాయామాలు చేస్తే ఈ నొప్పులని సులభంగానే అధిగమించవచ్చు. ఈ వ్యాయామాలు చేస్తే మీకు ఉన్న అన్నీ నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఒక్కో వ్యాయామాన్ని ఐదు నుంచి పది సెకన్లపాటూ చేస్తే సరిపోతుంది. * మొదట మెత్తని తువ్వాలుని తీసుకుని నాలుగైదు మడతలు వచ్చేటట్టుగా చేసి మడతపెట్టాలి. దాన్ని బల్ల అంచు దగ్గర ఉంచి ఇప్పుడు చేతి మణికట్టు కింద తువ్వాలు ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే అరచేయి గాల్లో ఉండాలి. ఇప్పుడు ఆ అరచేతిని పైకి, కిందకి నెమ్మదిగా ఆడిస్తూ కొన్ని క్షణాలు అరచేతిని కొద్దిగా వెనక్కి స్ట్రెచ్‌ చేయండి. * మీ చేతిని తొంభైడిగ్రీల కోణంలో ఉంచి మీ ఎదురుగా ఉంచాలి. ఇప్పుడు అరచేతిని నేలపై చూస్తున్నట్టుగా ఉంచాలి. మరొకసారి ఆకాశంవైపు. ఇలా మార్చిమార్చి చేయాలి. దీనినే ప్రొనేషన్‌ అంటారు. ఈ వ్యాయమాన్ని స్థిమితంగా కూర్చుని లేదా నిల్చుని చేయొచ్చు. * అరచేతిని పూర్తిగా తెరిచి ఉంచి ఇప్పుడు బొటనవేలిని లోపలికి మడచిఉంచాలి. తర్వాత బయటకు తీసుకురావాలి. ఇలా ఓ మోస్తరు వేగంగా నాలుగైదు సార్లు చేయాలి. * మొదట అరచేతిని పూర్తిగా తెరిచి ఉంచాలి. అలానే ఉంచి వేళ్లను మాత్రం మడిచి ఉంచాలి. ఇప్పుడు మరింతగా కిందికి వేళ్లను నొక్కుతూ ఒత్తిడి తీసుకురావాలి. ఇప్పుడు మామూలుగా చేతివేళ్లను తెరిచి ఉంచాలి. ఇలా మార్చిమార్చి వ్యాయామం చేయాలి.