గుజరాత్ లో వరుసగా ఆరోసారి భాజపా జయకేతనం...

SMTV Desk 2017-12-18 16:57:38  gujarat, bjp, win, elections

గాంధీనగర్, డిసెంబర్ 18: గత 22 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పటికీ మళ్లీ గుజరాత్ లో బీజేపీ తన సత్తా చాటింది. మొత్తం 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి 99, కాంగ్రెస్ కు 80, ఇతరులకు 03 స్థానాలు దక్కాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు, ముగ్గురు స్థానిక యువనేతల సహకారంతో కాంగ్రెస్ బరిలోకి దిగినప్పటికీ ప్రజలు అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన వైపు నిలుచున్నారని బిజెపి నేతలు అంటున్నారు. ఎన్ని రకాలుగా ప్రచారం చేసినా, వ్యూహాలు పన్నినా భాజపాను ఓడించలేక పరాజితులుగా మిగిలారు. పటేల్‌ వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో హార్ధిక్‌ పటేల్‌ రాష్ట్రంలో భాజపాకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించగా, ఓబీసీ నేత అల్పేష్‌ ఠాకూర్‌ మరో ముందడుగు వేసి ఏకంగా కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఉనాలో దళితులపై గో సంరక్షకులు చేసిన దాడికి నిరసన వ్యక్తంచేసి వెలుగులోకి వచ్చిన జిగ్నేష్‌ మెవానీ సైతం కాంగ్రెస్‌ మద్దతుతో పోటీచేశారు. గుజరాత్‌పై ప్రధాని నరేంద్రమోదీ ప్రభావం తగ్గలేదని తాజా ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. సీఎంగా మోదీ ఉన్న సమయంలో రాష్ట్రం పారిశ్రామిక ప్రగతిని అందుకుంది. పారిశ్రామికంగా దేశంలోనే ప్రథమస్థానంలోకి గుజరాత్ దూసుకెళ్లింది. దీంతో పాటు శాంతి భద్రతలు పూర్తి అదుపులోనే ఉండేవి. ప్రజారంజకమైన పాలనే కాదు గుజరాత్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మోదీ నిలిచారంటే అతిశయోక్తి కాదు. అందుకనే కుల, మతం, వర్గం, ప్రాంతీయ విభేదాలకు అతీతంగా మోదీకి గుజరాతీలు జేజేలు పలికారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 26 స్థానాల్లోనూ భాజపా విజయదుందుభి మోగించిందటే మోదీ నాయకత్వమే కారణం. వడోదరాతో పాటు వారణాసి నుంచి గెలుపొందిన మోదీ వడోదరా స్థానాన్ని వదులుకున్నారు. అయినా రాష్ట్ర ప్రజలు ఆయన నాయకత్వంపై విశ్వాసంతో తిరుగులేని విజయాన్ని అందించి వరుసగా ఆరోసారి బీజేపీకి అధికారాన్ని ఇచ్చారు.