మంత్రి ఆదేశాలను పట్టించుకోని ఆర్టీసీ...

SMTV Desk 2017-12-18 12:10:52  aprtc, double duty, achennayadu, andhrapradesh

అమరావతి, డిసెంబర్ 18: ఈ మధ్య కాలంలో ఆర్టీసీలో విధులు పూర్తయ్యాక కూడా డబుల్‌డ్యూటీ పేరుతో డ్రైవర్ ను బలవంతంగా పంపించడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల దసరా సమయంలో అవనిగడ్డ డిపోకు చెందిన ఓ డ్రైవర్‌కు తగిన విశ్రాంతి లేకపోవడంతో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. దీనిపై స్పందించిన రాష్ట్ర రవాణా మంత్రి కె.అచ్చెన్నాయుడు డబుల్‌ డ్యూటీలను నిలిపేయాలని, లింక్‌ డ్రైవర్లను కేటాయిస్తామని ఆర్టీసీ యాజమాన్యానికి తెలిపారు. దూరప్రాంతాలకు వెళ్లే డ్రైవర్లతో ఏకబిగిన అయిదు గంటలకు మించి నడిపించవద్దని చెప్పారు. కానీ మంత్రి ఆదేశాలను ఆర్టీసీ పెడచెవిన పెడుతోంది. ఆర్టీసీ డ్రైవర్ డబుల్‌ డ్యూటీపై మొగ్గు చూపడానికి ప్రధాన కారణం వేతనం. ఎందుకంటే డబుల్‌ డ్యూటీ చేసిన డ్రైవర్‌కు కనీసం రూ.1300 భత్యం, లేదంటే రూ.350 ఇచ్చి సరిపెడుతున్నారని, అలాగే సెలవు కావాలంటే డబుల్‌ డ్యూటీ చేయాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారని ఉద్యోగసంఘాలు తెలిపాయి. ఇప్పటికైనా ఆర్టీసీ తమకు తగిన పరిష్కారం కావాలని, ప్రమాదాలకు అంతిమంగా డ్రైవర్లను బాధ్యులను చేస్తే ఆందోళన చేపడుతామని పేర్కొన్నారు.