జీఎస్టీ సమావేశానికి కేటీఆర్

SMTV Desk 2017-06-17 12:43:07   Municipal IT Minister K. Taraka Rama Rao, DELHI, GSTC Council, Finance Minister Rajendra, son marriage

హైదరాబాద్, జూన్ 17 : తెలంగాణ రాష్ట్రం లోని మున్సిపల్ ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ నెల 18న ఢిల్లీలో జరుగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశానికి ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెళ్లాల్సి ఉండగా, అదేరోజు ఆయన కుమారుడి వివాహం ఉండటంతో రాజేందర్ కు బదులు కేటీఆర్ హాజరవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్, వాణిజ్యపన్నులశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. కొన్ని వస్తువులపై జీఎస్టీ పన్నురేటును తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వం కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇంటింటికీ మంచినీటి సరఫరా కోసం ఉద్దేశించిన మిషన్ భగీరథ పనులు, బీడీల తయారీకి ఉపయోగించే తునికాకు, బీడీలు, గ్రానైట్‌పై పన్నురేటును తగ్గించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కేంద్రానికి లేఖ రాశారు. ఈ విషయాన్ని సమావేశంలో కేటీఆర్ ప్రస్తావిస్తారని వెల్లడించారు.