పదం, సాహిత్యం పరిధి విసృతమైనది: మంత్రి జగదీశ్‌రెడ్డి

SMTV Desk 2017-12-17 12:53:15  jagadeeshreddy, minister, speech, world telugu conferences

హైదరాబాద్, డిసెంబర్ 17: మనిషిని మహాపురుషునిగా మార్చే శక్తి ఒక్క సాహిత్యానికి, మాటకు మాత్రమే ఉ౦దని తెలంగాణ విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఒక పదం, వాక్యం ఎన్నో విస్ఫోటనాలను సృష్టించగల అణుబాంబు లాంటిదని ఆయన అన్నారు. ఒక మంచిమాట, పదం అనేక జీవితాలలో వెలుగు ని౦పగలదని మంత్రి తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించిన పద్య కవితా సౌరభం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భాష భావవ్యక్తీకరణకు ఒక అవసరంగా పుట్టిన సాధనమని, ప్రపంచంలో ఎన్నో భాషలు ఉద్భవించి అంతరించి పోయాయన్నారు. మాతృభాషను మరిస్తే అమ్మను మరిచిపోయినట్టేనని ఆయన చెప్పారు. గతంలో తెలంగాణ భాష, యాసపై దాడి జరిగిందని గుర్తుచేశారు. వాటిని సుసంపన్నం చేసుకొనేందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సభలు ఏర్పాటుచేసిందని వివరించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కవులు తమ కవితల్ని వినిపించిన అనంతరం మంత్రి వారందరినీ ఘనంగా సత్కరించారు.