టీటీడీలో టైమ్‌స్లాట్‌ శాశ్వత అమలుకు కృషి

SMTV Desk 2017-12-16 15:58:31  TTD, Timeslot policy, JEO Srinivasa Raju

తిరుమల, డిసెంబర్ 16 : టీటీడీలో టైమ్‌స్లాట్‌ విధానం శాశ్వత అమలుకు కృషి చేస్తామని, జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. ఈ సందర్భంగా టైమ్‌స్లాట్‌ టోకెన్ల జారీపై తొలిరోజు శిక్షణను జేఈవో ప్రారంభించారు. కంప్యూటర్లు ఎప్పుడైనా మొరాయిస్తే ఇబ్బంది లేకుండా అదనంగా మరో 30వరకు కంప్యూటర్లను అందుబాటులో ఉంచారు. భక్తులు తమకు కేటాయించిన టైమ్‌స్లాట్‌ ప్రకారం దివ్యదర్శనం కాంప్లెక్స్‌కు చేరుకోవాలి. దర్శనానికి వెళ్లే సమయంలోనూ భక్తులు ఆధార్‌ కార్డును చూపించాలి. అప్పటి నుంచి దాదాపు 2గంటల్లోగా స్వామి దర్శనం పూర్తి చేసుకోవచ్చు. టోకెన్ల జారీపై శుక్ర, శనివారాల్లో సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామన్నారు. తిరుమలలో ఎంపిక చేసిన 14 ప్రాంతాల్లో 117 కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. సోమవారం ఉదయం నుంచి శనివారం వరకు ప్రయోగాత్మకంగా టోకెన్లు జారీ చేస్తామని, భక్తులు ఆధార్‌ కార్డు చూపి టోకెన్లను పొందవచ్చని తెలిపారు. ప్రతి కౌంటర్‌లో 24గంటల పాటు టైమ్‌స్లాట్స్‌, టోకెన్ల సంఖ్య ప్రదర్శిస్తామని, తమకు అనుకూలంగా ఉండే సమయాన్ని భక్తులే ఎంచుకోవచ్చన్నారు. క్యూలో వేచి ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి గదులను ఖాళీచేసి దర్శనానికి వెళితే ఇతర భక్తులకూ వసతి కల్పించడానికి సౌకర్యంగా ఉంటుందన్నారు. ఈ మేరకు ప్రయోగాన్ని ఈ నెల 17 నుంచి ప్రారంభం కానుంది.