ఫిబ్రవరి 1 నుంచి దేశవ్యాప్తంగా ఇ-వే బిల్లు: జీఎస్‌టీ మండలి

SMTV Desk 2017-12-16 15:36:41  e way bil, gst council, February 1, start

న్యూ డిల్లీ, డిసెంబర్ 16: ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా 24వ జీఎస్‌టీ మండలి సమావేశం జరిగి౦ది. జీఎస్‌టీ వసూళ్లు సెప్టెంబరుతో పోలిస్తే అక్టోబరులో రూ.12,000కోట్లు తగ్గడంపై ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చించారు. అలాగే పన్నుల ఎగవేతను నిరోధించేందుకు ఇ-వే బిల్లును తప్పనిసరి చేస్తూ వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) మండలి ఆమోదం తెలిపింది. ఇ-వే బిల్లు వ్యవస్థను జనవరి 15లోపు సిద్ధం చేసి ప్రయోగాత్మక దశ చేపట్టనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఫిబ్రవరి 1 నుంచి దేశవ్యాప్తంగా దీనిని అమల్లోకి తీసుకువస్తారు. జీఎస్‌టీ చట్టం ప్రకారం రూ.50వేల కన్నా ఎక్కువ విలువైన సరకు రవాణాకు ఇ-వే బిల్లును తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం కర్ణాటక సహా ఆరు రాష్ట్రాలు ఇ-వే బిల్లు అమలుకు సిద్ధంగా ఉన్నాయి. మరికొన్ని రాష్ట్రాలు ఇ-వే బిల్లులో సవరణలు చేస్తే దాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీనియర్‌ ప్రభుత్వాధికారి పేర్కొన్నారు. ఫిబ్రవరి ఒకటి నుంచి ఇ-వే బిల్లు అమలు చేసేందుకు అన్ని రాష్ట్రాలు సిద్ధంగా ఉండాల్సిందిగా ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది.