అగ్రస్థానంలో అజేయ సింధు...

SMTV Desk 2017-12-16 12:19:36  pv sindhu, bwf, women singles, kidambi srikanth,

దుబాయ్, డిసెంబర్ 16: బ్యాడ్మింటన్ స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు మరోసారి అజేయ విజయ౦ సాధించింది. బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌లో జరిగిన చివరి పోరులో 21-9, 21-13తో గ్రూప్‌-ఎ నుంచి సెమీస్‌కు అర్హత సాధించిన జపాన్‌ స్టార్‌ యమగూచిని చిత్తు చిత్తుగా ఓడించింది. మొదటి నుండి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తూ గ్రూప్‌ దశను తన గెలుపుతో ముగించింది. వరుసగా మూడు విజయాలతో గ్రూప్‌-ఎలో అగ్రస్థానం తన కైవసం చేసుకుంది. నేడు (శనివారం) జరగబోయే గ్రూప్‌-బిలో రెండో స్థానంతో సెమీస్‌కు అర్హత సాధించిన చైనా క్రీడాకారిణి చెన్‌ యుఫీని సింధు సెమీస్‌లో ఢీకొంటుంది. మరో సెమీస్‌లో యమగూచి, గ్రూప్‌-బి టాపర్‌ రచనోక్‌ (థాయిలాండ్‌)లు తలపడతారు. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో రెండు వరుస ఓటములతో సెమీస్‌ అవకాశం కోల్పోయిన శ్రీకాంత్‌, గ్రూప్‌-బిలో నామమాత్రమైన చివరి మ్యాచ్‌లోనూ గెలవలేకపోయాడు. 17-21, 21-19, 14-21తో షి యుకి (చైనా) చేతిలో పరాజయం చవిచూశాడు. ఈ గ్రూప్‌ నుంచి యుకితో పాటు ప్రపంచ నంబర్‌వన్‌ విక్టర్‌ అక్సెల్సన్‌ (డెన్మార్క్‌) కూడా సెమీస్‌ చేరాడు. లీ చాంగ్‌ వీ (మలేసియా), వాన్‌ హో సన్‌ (కొరియా) ముందంజ వేశారు.