జక్కన్న చెక్కిన తెలుగుతల్లి గ్రాఫిక్ వీడియో

SMTV Desk 2017-12-15 16:37:23  AP amaravathi, teluguthalli graffic video,

అమరావతి, డిసెంబరు 15 : ఆంధ్రప్రదేశ్ రాజధానిలో నిర్మించ తలపెట్టిన అసెంబ్లీ, హైకోర్టు భవనాల డిజైన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం.. రాజమౌళి సహకారాన్ని కోరిన విషయం తెలిసిందే. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్ గతంలో రాజమౌళిని కలిసి భవనాల ఆకృతుల గురించి వివరించారు. అయితే, ఈ విషయంపై రాజమౌళి ప్రత్యేకంగా లండన్ వెళ్లి పలు కట్టడాల డిజైన్లను పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఆయన సీఎంను పలుసార్లు కలిసి అంశంపై చర్చించారు. మొత్తానికి దర్శకుడు రాజమౌళి తన మార్కు కళాత్మకతకు పదును పెట్టి ఎత్తైన టవర్‌ నుంచి అసెంబ్లీ సెంట్రల్‌ హాలులోకి సూర్యకిరణాలు పడేలా నార్మన్‌ ఫోస్టర్‌ డిజైన్‌ రూపొందించి, వావ్‌ అనిపించారు. ఈ అసెంబ్లీ సెంట్రల్‌ హాలులో కిరణాలు పడుతున్న ప్రదేశంలో తెలుగుతల్లి రమణీయ విగ్రహం పెట్టాలని సూచించారు. అంటే పై నుంచి సూర్య కిరణాలు విగ్రహంపై పడతాయన్నమాట. అలా సూర్య కిరణాలు పడుతున్న తెలుగుతల్లి గ్రాఫిక్‌ వీడియోను రాజమౌళి అద్భుతంగా తీర్చిదిద్దారని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతానికి ఈ అంశంపై సోషల్‌ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది.