రాష్ట్రంలో టాటా-జీఈ ఏవియేషన్ జాయింట్ వెంచర్: కేటీఆర్

SMTV Desk 2017-12-15 16:26:35  aviation joint venture, tata-ge, hyderabad, ktr

హైదరాబాద్, డిసెంబర్ 15: పెట్టుబడులకు చిరునామాగా మారిన హైదరాబాద్ లో దాదాపు 3వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో విమానాల విడిభాగాల తయారీ యూనిట్ ఏర్పాటుకు దేశీయకంపెనీ టాటా గ్రూపు, అమెరికా కార్పొరేట్ దిగ్గజం జీఈ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. టాటా గ్రూపులోని ఏరోస్పేస్ విభాగమైన టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, జీఈ ఏవియేషన్ ఈ జాయింట్ వెంచర్‌ను చేపడుతాయి. 2016 అక్టోబర్‌లో రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని బృందం అమెరికాలో పర్యటించిన సందర్భంగా షికాగోలో జీఈ చైర్మన్‌తో భేటీ అయింది. తత్ఫలితంగా హైదరాబాద్ లో ఈ వెంచర్ ఏర్పాటుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కృషి ఫలించింది. తెలంగాణ ఏరో స్పేస్ రంగానికి ఈ ఒప్పందం మరింత ఊతం ఇస్తుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో జీఈ సంస్థ చైర్మన్ జాన్ ఫ్లానరీకి తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఏరో స్పేస్ తయారీ రంగానికి మొదటి నుంచి అండగా ఉన్న టాటా సంస్థకు, రతన్‌ టాటాకు, చైర్మన్ చంద్రశేఖరన్‌కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు