ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదించిన కేంద్ర క్యాబినెట్

SMTV Desk 2017-12-15 15:45:36  triple talaq, central cabinet, bill, aproval

న్యూ డిల్లీ, డిసెంబర్ 15: ముస్లిం మహిళా రక్షణపై చిత్తశుద్దితో ఉన్న కేంద్ర ప్రభుత్వం తాజాగా ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఇవాళ కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మూడుసార్లు తలాక్ అని చెప్పి విడాకులు తీసుకునే ఈ ముస్లిం సంప్రదాయాన్ని కేంద్ర ప్రభుత్వంతో సహా సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టింది. దీంతో యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టిన ప్రభుత్వం సంబంధిత బిల్లు తయారు చేసి ట్రిపుల్ తలాక్ కు స్వస్తి పలకడానికి సిద్దమైంది. తాజాగా ఈ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపగా ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే దీనిని ప్రవేశ పెట్టనున్నారు. ఆ తర్వాత ట్రిపుల్ తలాక్‌పై చట్టాన్ని రూపొందిస్తారు. ఈ బిల్లు చట్టంగా మారితే ముస్లిం మహిళలకు మరింత రక్షణ ఏర్పడే అవకాశాలున్నాయి. ట్రిపుల్ తలాక్ కేసు కింద మహిళలు మెయింటెనెన్స్ తీసుకునే అవకాశం కూడా ఉన్నది. ట్రిపుల్ తలాక్ సాంప్రదాయం ఓ హత్య లాంటిందని ఈరోజు ఉదయం బీజేపీ మంత్రి గిరిరాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు. అయితే అనేక ముస్లిం సంఘాలు, రాజకీయ నాయకులు ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకిస్తూ, అనాదిగా వస్తున్న ముస్లిం సంప్రదాయాలను బీజేపీ మంటగలుపుతుందని వారు విమర్శిస్తున్నారు.