ఫిరాయింపులపై అన్ని సభల్లో ఒకే విధంగా వ్యవహరించాలి: మేకపాటి

SMTV Desk 2017-12-15 15:04:01  mekapati, defections, ycp flour leader, rools

న్యూ డిల్లీ, డిసెంబర్ 15: పార్టీ ఫిరాయింపుల విషయంలో పార్లమెంటులోనైనా, అసెంబ్లీ లోనైనా సభాపతి ఒకే విధంగా ప్రవర్తించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజ్యసభలో మూడు నెలల్లో ఇద్దరు జేడీయూ ఎంపి లపై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు అనర్హత వేటు వేయగా, లోక్ సభలో మూడేళ్లు గడిచినా ఫిరాయింపు ఎంపీ లపై లోక్ సభ సభాపతి సుమిత్రా మహాజన్ ఎందుకు అనర్హత వేటు వేయలేదని ఆయన ప్రశ్నించారు. ఫిరాయింపుల విషయంలో రాజ్యసభ కు ఒక రూల్, లోక్ సభకు మరో రూల్ వర్తింప చేస్తారా అని ఆయన నిలదీశారు. అసెంబ్లీ భవనాన్ని బ్రహ్మాండంగా నిర్మిస్తామని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం, అలాంటి భవనంలో ఇలాంటి అనైతిక ఫిరాయింపులను ప్రోత్సహించడం శోచనీయమని మేకపాటి వ్యాఖ్యానించారు. దీనిపై వెంటనే చట్ట సవరణ చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని కలిసి విజ్ఞప్తి చేస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఏదైనా ఫిరాయింపు దారులపై నిర్దిష్ట సమయంలో చర్యలు తీసుకోవాలని, ఒకవేళ ప్రజాప్రతినిధులు పార్టీ మారాలనుకుంటే మాతృ పార్టీకి, పదవికి రాజీనామా చేసి వెళ్ళాలని ఆయన సూచించారు.