అత్యాచారం కేసులో ఉరిశిక్ష..

SMTV Desk 2017-12-14 15:44:27  death sentence, aamirul islam kocchi, kerala, ernakulam

కొచ్చి, డిసెంబర్ 14 : దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ తరహా ఘటనలో మాదిరి.. అత్యంత పాశవికంగా, విచక్షణ మరిచిపోయి ఓ న్యాయవిద్యార్థి మృతికి కారణమైన అమీరుల్‌ ఇస్లామ్‌కు ఎర్నాకుళం న్యాయస్థానం ఉరిశిక్ష ఖరారు చేసింది. ఎర్నాకుళంలోని పెరుంబవూర్‌కు చెందిన దళిత న్యాయ విద్యార్థిని గతేడాది ఏప్రిల్‌లో అత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. 2016 ఏప్రిల్‌లో అసోం నుంచి కేరళకు వలస వచ్చిన అమీరుల్‌ ఇస్లామ్‌.. 30ఏళ్ల దళిత న్యాయ విద్యార్థినిపై ఇంట్లోనే అత్యంత క్రూరంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతే కాకుండా ఆమెను దారుణంగా హింసించి, చంపేశాడు. బయటకు వెళ్లిన తల్లి ఇంటికి తిరిగొచ్చి చూసే సరికి బాధితురాలు రక్తపు మడుగులో నగ్నంగా పడి ఉంది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ అనంతరం పోలీసులు అమీరుల్‌పై అత్యాచారం, హత్య కేసు నమోదు చేశారు. ఈ భయంకర ఘటనలో అసోంకు చెందిన వలస కార్మికుడు అమీరుల్‌ను దోషిగా తేల్చిన ఎర్నాకుళం కోర్టు, నేడు ఉరిశిక్ష విధించింది.