అమరావతిని దేశానికే బ్రాండ్‌ నగరంగా తీర్చిదిద్దుతాం : శ్రీధర్‌

SMTV Desk 2017-12-14 15:23:13  crda, sridhar, amaravati, ideal city, construction

అమరావతి, డిసెంబర్ 14 : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరాన్ని ప్రపంచ స్థాయిలో హరిత, నీలి నగరంగా నిర్మిస్తున్నట్లు సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి శ్రీధర్‌ తెలిపారు. ప్రస్తుతం భవన సముదాయాల ఆకృతులపై తుది నిర్ణయాలు జరుగుతున్నాయని తెలిపారు. "ముంబయి, బెంగళూరు, డిల్లీ వంటి వాటితో పోటీపడుతూ ఆధునిక నగరాన్ని నిర్మిస్తున్నాం. అమరావతిలో ఇప్పటికే రూ.20వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి. ఐకానిక్‌ భవనాలు నిర్మించాలన్నది మా కల. అద్భుతమైన భవనాలుంటేనే ప్రజలు వాటిని చూడటానికి వస్తారు. అందుకే ప్రణాళికకు, నిర్మాణానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నాం. అమరావతిని ఆనందమయ నగరంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం" అని ఆయన పేర్కొన్నారు. హ్యాపీ సిటీ విజన్‌, ప్రభుత్వ భవన సముదాయాలు, మౌలిక సదుపాయాలు, రవాణా, ఆర్థిక కేంద్రంగా అమరావతి వంటి అంశాలపై చర్చిస్తూ 35 నెలల్లో 50శాతం నిర్మాణ లక్ష్యాలను చేరుకున్నామని, ఆకృతుల్లో చూపినట్లు అమరావతి కనిపించడానికి ఇంకెంతో కాలం పట్టదని శ్రీధర్ తెలిపారు. ప్రతిక్షణం, ప్రతిరోజూ రూపును మార్చుకుంటూ అద్భుత నగరం నిర్మితమవుతోందని, అమరావతిని రాష్ట్రానికే కాదు దేశానికే బ్రాండ్‌ నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.