మరో అరుదైన రికార్డు ముంగిట భారత్ జట్టు

SMTV Desk 2017-12-14 13:54:01  india, srilanka, century records, south africa, rihit shrma

మొహాలి, డిసెంబర్ 14 : ప్రస్తుత ప్రపంచ క్రికెట్ చరిత్రలో భారత్ జట్టు అన్ని విభాగాల్లో చెలరేగుతూ, చిరస్మరణీయమైన విజయాలును సాధిస్తూ ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా మరో రికార్డుకు అడుగు దూరంలో నిలిచింది. ఇప్పటి వరకు వన్డే క్రికెట్‌ చరిత్రలో ఒక క్యాలండర్‌ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన జట్లలో దక్షిణాఫ్రికా-టీమిండియాలు సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. 2015లో సఫారీలు 18 వన్డే సెంచరీలు సాధించగా, 2017లో టీమిండియా ఆ రికార్డును సమం చేసింది. నిన్న మొహాలిలో లంకేయులతో జరిగిన మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్‌ డబుల్‌ సెంచరీ సాధించడం ద్వారా దక్షిణాఫ్రికా సరసన టీమిండియా నిలిచింది. ఇక ఆదివారం వైజాగ్ వేదికగా శ్రీలంకతో జరిగే నిర్ణయాత్మక చివరి వన్డేలో భారత జట్టు ఒక్క శతకం సాధిస్తే, ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు చేసిన జట్టుగా నిలుస్తుంది. ఇంతకుముందు భారత్ జట్టు 1998లో తొలిసారి 18 వన్డే సెంచరీలు నమోదు చేసింది. అంతే కాకుండా వన్డే క్రికెట్‌ చరిత్రలో రెండు సార్లు 18 సెంచరీల మార్కును చేరిన జట్టుగా భారత్ నిలిచింది. ఈ ఏడాది భారత్‌ జట్టు వన్డేల్లో సాధించిన సెంచరీల్లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఆరు సెంచరీలు చేయగా, స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ కూడా ఆరు సెంచరీలు సాధించాడు. ఇక మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ రెండు శతకాలు చేయగా, రహానే, జాదవ్‌, యువరాజ్‌ సింగ్‌, ధోనిలు తలో ఒక సెంచరీలు చేశారు.