విడుదలైన ఏపీ టెట్‌ నోటిఫికేషన్‌

SMTV Desk 2017-12-14 13:49:33  tet, notification, govt, andhrapradesh, gantaa, release

అమరావతి, డిసెంబర్ 14 : ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) నోటిఫికేషన్‌ ను గురువారం మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. నోటిఫికేషన్‌తో పాటు సిలబస్‌ను ప్రకటించారు. షెడ్యూల్‌ ప్రకారం.. జనవరి 17 నుంచి 27 వరకు రోజుకు రెండు సెషన్స్‌గా పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఒక్కో కేంద్రంలో ఒక్కో సెషన్‌కు 5 వేలు మంది విద్యార్థులు పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరీక్షకు 3 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరుకావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉపాధ్యాయ నియామకాల్లో పారదర్శకత ఉండేందుకు ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీఆర్‌టీ)ను ఏపీపీఎస్సీకి అప్పగించనున్నామని, జూన్‌లో పాఠశాలలు తెరిచే సమయానికి నియామకాలు పూర్తి చేసే విషయంపై రెండు, మూడు రోజుల్లో ఏపీపీఎస్సీతో చర్చిస్తామని మంత్రి వెల్లడించారు. టెట్‌ షెడ్యూల్‌ ప్రకారం దరఖాస్తు రుసుములు ఈనెల 18 నుంచి 30 వరకు చెల్లించి, దరఖాస్తులను డిసెంబర్ 18 నుంచి జనవరి 1 వరకు సమర్పించవచ్చు. జనవరి 17నుంచి 27 వరకు పరీక్షలు జరిపి ఫిబ్రవరి 8న తుది ఫలితాలు వెల్లడించనున్నారు. ఈపరీక్షకు సంబంధించి మరిన్ని వివరాలను http://cse.ap.gov.in లో తెలుసుకోవచ్చని మంత్రి గంటా వెల్లడించారు.