వాయు, జల విమానంలో ప్రయాణించిన ఏపీ సీఎం...

SMTV Desk 2017-12-14 12:46:03  chandrababu, journey, sea plane, prakasham barrage

విజయవాడ, డిసెంబర్ 14 : ఉభయచర విమానంలో ఇటీవల మోదీ ప్రయాణించిన విషయం విదితమే. తాజాగా ఆ జాబితాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కొందరు మంత్రులు చేరారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదిలో స్పైస్‌జెట్‌ సంస్థ ఆధ్వర్యంలో ఈ విమానం ట్రయల్‌ రన్‌ను బుధవారం నిర్వహించారు. చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు, రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, భూమా అఖిలప్రియ తదితరులు ఇందులో ప్రయాణించారు. నీటిపై, నేలపై దిగే ఇలాంటి విమానాలతో పర్యాటకం వృద్ధిపొందుతుందని వరదలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కూడా వీటిని వాడుకోవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు. దీనికి పొడవైన రన్‌వే అవసరం లేదని కేవలం 360 మీటర్ల పొడవు, రెండు మూడు అడుగుల నీళ్లు ఉంటే చాలని సీఎం తెలిపారు. ఇలాంటివి వంద విమానాలు కొనడానికి సిద్ధంగా ఉన్నామని స్పైస్‌జెట్‌ సీఎండీ అజయ్‌సింగ్‌ ప్రకటించినందున, నడిపేందుకు అవసరమైన నిబంధనలను త్వరగా రూపొందించాలని పౌరవిమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజును ముఖ్యమంత్రి కోరారు. కృష్ణా నదిలో నెల రోజుల్లోగా వీటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలన్నారు.