కొలిక్కి వస్తున్న ఏపీ శాసనసభ, హైకోర్టు ఆకృతులు..!

SMTV Desk 2017-12-14 12:14:17  ap assembly, high court bluildings shape, chandrababu, meeting, crda, new shape

అమరావతి, డిసెంబర్ 14: ఏపీ రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే శాసనసభ, హై కోర్ట్ ఆకృతుల ఎంపిక తుదిదశకు చేరుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో వీటిపై సుదీర్ఘంగా చర్చించారు. నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ చతురస్రాకారంలో, భవనంపై ఎత్తైన టవర్‌తో రూపొందించిన రెండు ఆకృతుల్ని మరింత మెరుగుపరిచి తీసుకువచ్చింది. భవనంపై సూది మొనలాంటి (సైక్‌) పొడవైన టవర్‌తో సిద్ధం చేసిన ఆకృతి ఎక్కువ మందిని ఆకట్టుకుంది. సినీ దర్శకుడు రాజమౌళి కూడా పాల్గొన్నారు. రెండు ఆకృతుల వీడియో చిత్రాలను సీఆర్‌డీఏ వెబ్‌సైట్‌లోను, సామాజిక మాధ్యమాల్లోను ఉంచి ప్రజాభిప్రాయం తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రజాభిప్రాయాన్ని బట్టి గురువారం తుదినిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. హైకోర్టు, శాసనసభ భవనాలను 2019 మార్చి నాటికి పూర్తి చేస్తామన్నారు. సమావేశం అనంతరం సినీదర్శకుడు రాజమౌళి స్పందిస్తూ.. "రామసేతువు నిర్మాణంలో వందల సంఖ్యలో వానరసైన్యం పాల్గొన్నా.. వారందరి పేర్లు ఎవరికి తెలియవు. ఉడత పేరే అందరికి తెలుస్తుంది. నా పరిస్థితి కూడా అదే" అని పేర్కొన్నారు. తెలుగువారికి గర్వకారణంగా, దిగ్గజ భవనంలా, భారతీయత ఉట్టిపడుతూ సంస్కృతి ప్రతిబింబించేలా ఈ భవన ఆకృతులు ఉంటాయని రాజమౌళి పేర్కొన్నారు.