బాబు పోలవరంపై కౌంటర్ దాఖలు చేయండి : కేవిపి లేఖ

SMTV Desk 2017-12-13 17:56:26  kvp, petetion, letter, chandrababu, counter, polavaram

అమరావతి, డిసెంబర్ 13: ఎలాంటి నిబంధనలు పెట్టకుండా ఏపీ విభజన చట్టం ప్రకారం పోలవరం పూర్తి ఖర్చును కేంద్రమే భరించేలా ఆదేశాలు ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఉమ్మడి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీన్ని విచారించిన ఉన్నత న్యాయస్థానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్‌ దాఖలుకు నాలుగు వారాల సమయం ఇస్తూ విచారణను ఈనెల 19కు వాయిదా వేసి౦ది. అయితే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున కౌంటర్‌ దాఖలు చేయలేదని తెలుస్తోందని కేవిపి చంద్రబాబుకి రాసిన లేఖలో పేర్కొన్నారు. కేంద్రం తాను చేసిన చట్టాన్ని తానే ఉల్లంఘిస్తుంటే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సిన మీరు.. కేంద్రం అడుగులకు మడుగులొత్తడం చూస్తుంటే మీ స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి కూడా వెనుకాడడంలేదని స్పష్టమవుతోందని చంద్రబాబుపై కేవీపీ ధ్వజమెత్తారు. జాతీయ ప్రాజెక్టులు ఏవీ సకాలంలో పూర్తికావడంలేదనే సాకుతో కేంద్రం ఆంక్షలకు ఒప్పుకుంటూ జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణాన్ని మీ చేతుల్లోకి తీసుకుని అంచనాలను నచ్చిన రీతిలో పెంచుకుంటూ ప్రాజెక్టును గందరగోళ స్థితికి నెట్టేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని ఆయన తెలిపారు.