పని ఒత్తడిని తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య

SMTV Desk 2017-12-13 12:15:32  suicide, bank manager, narasannapeta, srikakulam

నరసన్నపేట, డిసెంబర్ 13 : మరణ శాసనం ...ప్రస్తుత కాలంలో ఒత్తిడిని జయించలేక ఎవరికీ వారు రాసుకుంటున్నారు. ఎక్కడ చూసినా ఆత్మహత్యలు సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేటలోని మారుతీనగర్‌-2లో అద్దె ఇంట్లో ఉంటున్న సిండికేట్‌ బ్యాంకు మేనేజర్‌ చుక్కల భరత్‌ కుమార్‌ (26) అలియాస్‌ పవన్‌ మంగళవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు. సీతంపేట మండల కేంద్రానికి చెందిన భరత్‌కుమార్‌ 2015లో సిండికేట్‌ బ్యాంకులో ఉద్యోగం సాధించాడు. మొదటి పోస్టింగ్‌ అనంతపురం జిల్లా కుందిర్తిలో వచ్చింది. అక్కడే 2017 జూలై వరకు పనిచేసిన ఈయన తర్వాత శ్రీకాకుళంకు బదిలీపై వచ్చారు. అక్కడి నుంచి నరసన్నపేట బ్యాంకుకు ఇన్‌చార్జి మేనేజర్‌గా పంపించి సంబంధిత అధికారులు బాధ్యతలను అప్పగించారు. ఈ పని ఒత్తిడిని తట్టుకోలేక స్థానిక మారుతీ నగర్‌ రెండవ వీధిలో, తాను అద్దెకు ఉంటున్న ఇంట్లో శ్లాబ్‌ హుక్‌కు ప్లాస్టిక్‌ తాడుతో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకోక ముందు మమ్మీ.. డాడీ.. నన్ను క్షమించండి అంటూ సూసైడ్‌ నోటు రాసి కుటుంబ సభ్యులల్లో తీరని శోకాన్ని నింపాడు. భరత్ మృతితో సొంత గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తండ్రి దుర్గాప్రసాద్‌ ఫిర్యాదు మేరకు నరసన్నపేట ఇన్‌ఛార్జి ఎస్సై చంద్రమౌళి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.