చిన్న చిన్న వ్యాయామాలతో ఆరోగ్యం

SMTV Desk 2017-06-16 16:57:29  Jim, Exercise,Cardio exercises

హైదరాబాద్, జూన్ 16 : వ్యాయామం చేయాలంటే జిమ్‌కే వెళ్లాలా? అవసరం లేదంటారు నిపుణులు. చిన్నచిన్నవ్యాయమాలకు కూడా ఇతరుల మీద ఆధారపడకుండా ఇంట్లోనే వ్యాయామాల్ని చేయడం అలవాటుగా మార్చుకుంటే ఆరోగ్యం సొంతమైనట్లేనని చెబుతున్నారు. రోజూ ఇరవై నిమిషాల నుంచి అరగంట చొప్పున వారంలో ఐదు రోజులు.. నడవడం అలవాటుగా మార్చుకోండి. అలాగే దగ్గరిదగ్గరి పనులకు స్కూటీనో, ఆటోనో ఎక్కకుండా నడకకే ప్రాధాన్యం ఇచ్చి చూడండి. సన్నబడటమే కాదు.. గుండెకూ మంచిది. కార్డియో వ్యాయామాలు చేయాలంటే జిమ్‌కి వెళ్లాల్సిందే అనుకుంటున్నారా? అవసరం లేదు. వేగంగా నడిచి లోతుగా, దీర్ఘంగా శ్వాస తీసుకోండి. అంతకు మించిన కార్డియో(గుండె) వ్యాయామం మరొకటి లేదు. మెట్లు ఎక్కిదిగడం కూడా మంచి వ్యాయామమే! దీనివల్ల నడుము దిగువ భాగానికి తగిన శ్రమ అందుతుంది. ఇంట్లో కూడా చిన్నచిన్న స్ట్రెచింగ్‌, వ్యాయామాలూ, పుషప్‌లు ప్రయత్నించండి. ఇవి బరువును అదుపులో ఉంచడమే కాదు, కండరాలకూ ఎంతో మేలుచేస్తాయి. వ్యాయామాన్ని ప్రేమించే ఓ వ్యక్తిని స్నేహితులుగా చేసుకోండి. ఆమెతో మీ వ్యాయామ విశేషాలు పంచుకుంటుంటే ఉత్సాహం పెరుగుతుంది. మీరు పొరపాట్లు చేసినా సరిదిద్దుతారు. ఇలాంటివాళ్లే మీరు వ్యాయామం మానకుండా చూస్తారు! వ్యాయామం క్రమం తప్పకుండ ఇష్టంతో చేయడం ద్వారా ఇతరులు కూడా మీ బాటలోనే రావడం జరుగుతుంది. అలా చేయటంతో అందరు ఆరోగ్యదాయకంగా ఉంటారు. వ్యాయామాన్ని మీ దిన చర్యలో భాగంగా చేసుకోండి.