చంద్రుడి పై త్వరలో అమెరికన్ల అడుగు

SMTV Desk 2017-12-12 14:32:24  American President Donald Trump, The Moon Foot vowels

వాషింగ్టన్, డిసెంబర్ 12 ‌: చంద్రుడిపైకి వెళ్లిన ఆఖరి వ్యక్తి హారిసన్‌ కాకూడదని ఈ నేపథ్యంలో అక్కడ అమెరికన్‌ పాదాల అచ్చులు మరల ఉండాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. వైట్‌హౌస్‌లో ట్రంప్‌ ‘న్యూ స్పేస్‌ పాలసీ డైరెక్టీవ్‌’పై సంతకం చేస్తూ ‘ఈసారి చంద్రుడిపై అమెరికా జెండానే కాదు, అమెరికన్‌ పాదాల అచ్చులుకూడా ఉండాలంటూ, మార్స్‌ మిషన్‌కు సంబంధించి ఓ ఫౌండేషన్‌ను ప్రారంభిస్తానని అన్నారు. 1960 నుంచి 1970ల మధ్యలో అపోలో మిషన్‌లో భాగంగా చివరి సారిగా అమెరికన్‌ వ్యోమగాములు చంద్రుడిపైకి వెళ్లారు. చంద్రుడిపైకి వెళ్లిన తొలి వ్యోమగామి నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌. 1969 జులై 20న ఆయన చంద్రుడిపై కాలుమోపారు. ఆ తర్వాత నాసా మాజీ వ్యోమగామి హారిసన్‌ ష్మిట్‌ చంద్రుడిపైకి వెళ్లారు. ఆఖరిగా చంద్రుడిపైకి వెళ్లిన అమెరికన్‌ వ్యోమగామి హారిసనే. ట్రంప్‌ స్పేస్‌ పాలసీపై సంతకం చేస్తున్నప్పుడు ఆయనతో పాటు హారిసన్‌ కూడా ఉన్నారు. చంద్రుడిపైకి వెళ్లిన ఆఖరి వ్యక్తి హారిసన్‌ కాకూడదని ట్రంప్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్‌ కూడా 2005 నుంచి 2009లో జరిగిన కాన్‌స్టిలేషన్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా అమెరికన్లను చంద్రుడిపైకి పంపించాలని నాసాను కోరారు. ఈ ప్రోగ్రామ్‌కు అయిన ఖర్చు దాదాపు 100 బిలియన్‌ డాలర్లు. ఈ ప్రోగ్రామ్‌ ద్వారా 2020లోగా అమెరికన్లను చంద్రుడిపైకి పంపించాలని నిర్ణయించారు. కానీ, ఆ తర్వాత మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మాత్రం దీనిపై పెద్దగా ఆసక్తి చూపించలేదు. మళ్లీ ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ దీనిపై చాలా ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా దీనిపై ఇతర దేశాలకు చెందిన ప్రైవేట్‌ రంగాలతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని వైట్ హౌస్ నుంచి అందిన సమాచారం. ఈ మేరకు త్వరలో నాసాను ట్రంప్ కోరినట్లు తెలుస్తోంది.