ఉగ్రవాద౦పై ఉమ్మడి పోరు: ఆర్‌ఐసీ

SMTV Desk 2017-12-12 12:02:54  ric, meeting, terrorism, externel affairs ministers, 15th meeting

న్యూ డిల్లీ, డిసెంబర్ 12: ప్రపంచానికి సవాలు విసురుతున్న ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న సహించేది లేదని, దాన్ని నిరోధించేందుకు కలిసికట్టుగా పోరాడతామని భారత్‌, రష్యా, చైనా స్పష్టంచేశాయి. శాంతి, సహనం, సహకార పూరిత ప్రపంచాన్ని నిర్మించాలని వారు ఉద్ఘాటించారు. న్యూ డిల్లీలో మూడు దేశాల విదేశాంగ మంత్రుల 15వ సమావేశం జరిగిన అనంతరం సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. తాము ఏ ఒక్క దేశాన్ని ఉద్దేశించి సంఘటితం కాలేదని, అన్ని దేశాలు కూడా ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చాయి. అంతకు ముందు రష్యా, ఇండియా, చైనా (ఆర్‌ఐసీ కూటమి) విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ తో సుష్మాస్వరాజ్‌ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ఉన్న డోక్లాం వంటి కీలకమైన సమస్యలపై చర్చించారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్జే లావ్రోవ్‌తోనూ సుష్మ విడిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరిచే అంశాలపై చర్చించినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌కుమార్‌ ట్విట్టర్ ద్వారా తెలిపారు.