గాలి పీల్చి బతుకుతున్న దంపతులు...

SMTV Desk 2017-06-16 14:53:10  america , air , california , akahi ricardo , kamila

కాలిఫోర్నియా, జూన్ 16: నిత్యా జీవనంలో ఆహారం తినడం అతిముఖ్యం. ప్రస్తుత వాతావరణంలో ఉన్న కాలుష్యానికి రోజుకు మూడుసార్లు తిన్నా అనారోగ్యం బారిన పడుతున్నారు. కానీ దీనికి భిన్నంగా అమెరికాలోని ఓ జంట వారి ఆహార నియమాలను మార్చుకొని వారానికి మూడుసార్లు మాత్రమే ఆహారం తీసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అకహి రికార్డొ, కమిలా కస్టెల్లొ అనే భార్యాభర్తలు అమెరికాలోని కాలిఫోర్నియాలో నివసిస్తున్నారు. వీరిద్దరికీ 2005లో వివాహమైంది. అప్పట్నుంచి మూడేళ్లపాటు దక్షిణ అమెరికాలోని వివిధ ప్రాంతాలను చుట్టివచ్చారు. ఈ క్రమంలో ఎలాంటి ఆహారం లేకుండా కేవలం గాలిని పీల్చుకుంటూ జీవించవచ్చని ఓ స్నేహితుడి ద్వారా ఈ దంపతులు తెలుసుకున్నారు. ఆ పద్ధతిని ఆచరించి చూద్దామని ఆలోచించిన ఈ దంపతులు 21రోజుల ప్రోగ్రాం అనుకున్నారు. దాని ప్రకారం మొదటి ఏడు రోజులు ఎలాంటి ఆహారాన్ని తీసుకోలేదు. కేవలం గాలిని మాత్రమే పీల్చారు. తర్వాత రెండు వారాలు కొద్దిగా నీళ్లు.. పండ్ల రసాలను తీసుకున్నారు. అప్పట్నుంచి అదే పద్ధతినే అనుసరిస్తున్నారీ దంపతులు. అలా ఆహారం విషయంలో మిగిలిన డబ్బుతో ఇంటికి కావాల్సిన సామాగ్రి కొనుగోలు చేయడం.. వివిధ ప్రాంతాలు తిరిగి రావడానికి వినియోగిస్తున్నారట. వీరికి ఇద్దరు పిల్లలు. కమిలా గర్భవతిగా ఉన్న సమయంలోనూ ఇదే విధానాన్ని పాటించిందట. అలా తొమ్మిది నెలలపాటు గాలితో పాటు వారానికి ఐదుసార్లు.. అవి కూడా ద్రవ పదార్థాలనే ఆహారంగా తీసుకునేదట. అయినప్పటికీ పూర్తి ఆరోగ్యవంతంగా ఉన్న బిడ్డకు జన్మనిచ్చినట్లు చెబుతోంది కమిలా. ప్రస్తుతం ఈ దంపతులు వారానికి మూడు నుంచి నాలుగు సార్లు మాత్రమే ఆహారంగా తీసుకొని గాలిని పీల్చుకుంటూ జీవిస్తున్నారు. అయితే తమ ఇద్దరు పిల్లలకు మాత్రం ఇదే విధానాన్ని అనుసరించాలని ఒత్తిడి తీసుకురావడం లేదని.. వాళ్లకు నచ్చింది తినిపిస్తామని చెబుతున్నారు.