వాషింగ్టన్, డిసెంబర్ 11 : అమెరికా రాయబారి నిక్కీ హేలీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అమెరికన్ టెలివిజన్ షో "ఫేస్ ఆఫ్ ది నేషన్" కార్యక్రమంలో పాల్గొన్న నిక్కీ, అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్‌పై ఎందరో మహిళలు లైంగిక ఆరోపణలు చేశారంటూ ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "ప్రస్తుత మహిళలు ధైర్యంగా ఇలాంటి విషయాల గురించి మాట్లాడుతున్నందుకు చాలా గర్వంగా ఉంది. వారి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. ఇదే విషయం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి కూడా వర్తిస్తుంది. ఆయన కారణంగా మహిళలు ఇబ్బందులు ఎదుర్కొని ఉంటే ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడాలి. అలా మాట్లాడిన వారి మాటలను మనం వినాలి" అంటూ పేర్కొన్నారు.