గుజరాత్ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన..!

SMTV Desk 2017-12-11 14:41:42  gujarath elections, forgot evm units, narmadha district, ec officer ninamaa.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11 : గుజరాత్ ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన తర్వాత ఎన్నికల అధికారులు ఓ ఈవీఎం యూనిట్‌ను జీపులోనే వదిలేసి వెళ్ళిపోయిన ఘటన నర్మద జిల్లాలోని దండిపద నియోజకవర్గంలో చోటుచేసుకుంది. గుజరాత్ తొలి దశ ఎన్నికల సందర్భంగా దండిపదలోని కంజల్ గ్రామంలో అధికారులు పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌కి తరలించాల్సి ఉంది. ఈ క్రమంలో ఓ ప్రయివేటు జీప్‌లో ఈవీఎంలను తరలించిన అధికారులు.. ఓ యూనిట్‌ను జీపులోనే మర్చిపోయి వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఆ జీపు డ్రైవర్ ఈవీఎంలను గుర్తించి స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్ళాడు. కాగా ఈ విషయంపై ఎన్నికల అధికారి ఆర్‌ఎస్ నినమా వివరణ ఇచ్చారు. ఆ ఈవీఎంలను పోలింగ్ కోసం వినియోగించలేదని, ఖాళీవేనని పేర్కొన్నారు. ఇప్పటికే అధికారులకు షోకాజ్ నోటీసులు జారీచేసి, ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చినట్టు వెల్లడించారు.