పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వ అండ

SMTV Desk 2017-06-16 13:19:44   Finance Minister Rajendra, Federation of Chamber of Commerce, GSTC CouncilTraders, industries,

హైదరాబాద్, జూన్ 16 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు ప్రాధాన్యమిస్తున్నదని, వ్యాపారులు, పరిశ్రమల వర్గాలకు అండగా ఉంటుందని రాష్ట్ర పౌరసరఫరాల, ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. బేగంపేట్ హోటల్ మనోహర్ లో తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ చాంబర్ ఆఫ్ కామర్స్, ట్రేడ్ ఆధ్వర్యంలో గురువారం జీఎస్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జూలై 1 నుంచి అమలు కానున్న వస్తు, సేవల పన్ను చట్టంతో కొన్ని రంగాల వారు ఆందోళనతో ఉన్నారని, జీఎస్టీ ద్వారా కొన్ని వస్తువుల మీద పన్ను పెరిగితే, మరికొన్నింటి పైన తగ్గే అవకాశం ఉందన్నారు. కాగా అత్యంత పేదలు వినియోగించే వస్తువుల ధరలు తగ్గేందుకు, వాటిపై పన్ను తక్కువగా ఉండాలని జీఎస్టీ కౌన్సిల్‌కు తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రతిపాదించామని తెలిపారు. జీఎస్టీ విధానంలో కొత్తలో ఏమైనా ఇబ్బందులు, అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలనికోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున జీఎస్టీ కౌన్సిల్‌కు ప్రతిపాదనలు పంపి పరిష్కారం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ జీఎస్టీ ఉద్దేశాన్ని వ్యాపారులు అవగాహన చేసుకోవాలని, రూ.20 లక్షలకు పైగా రాబడి ఉన్న వ్యాపారులు జీఎస్టీకి ఎన్‌రోల్ చేసుకోవాలని సూచించారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ చాంబర్ ఆఫ్ కామర్స్, ట్రేడ్ అధ్యక్షుడు ఎ.ప్రకాశ్, ప్రధాన కార్యదర్శి నందకుమార్, ఉపాధ్యక్షుడు ఎంమురళీకృష్ణ, వేణువినోద్ తదితరులు పాల్గొన్నారు. జీఎస్టీ విధి విధానాలు అమలులోకి వస్తేనే ఎటువంటి సమస్యలు తలెత్తుతాయో తెలుస్తుందని వెల్లడించారు.