ఫిల్మ్‌ స్టూడియో డిజిటల్ వైపు మళ్లింపు...

SMTV Desk 2017-12-11 11:54:02  Eros International, md Jyoti Deshpande, internet,

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ప్రస్తుత కాలంలో టీవీలో సినిమాలు చూసే వారి సంఖ్య తక్కువ కావడం, ఇంటర్నెట్ లో చూసే వారి సంఖ్య ఎక్కువ కావడం తెలిసిందే. దీనిని ఆధారంగా చేసుకొని పలు సంస్థలు సినిమా విడుదలైన రెండు వారాలకే హెచ్ డి ప్రింట్ తో సినిమాలను అందిస్తున్నాయి. ఇప్పుడు ఇదే క్రమంలో ఫిల్మ్‌ స్టూడియోగా ఉన్న ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ ఓ కంపెనీగా మారనుంది. ఒకవైపు ఫిల్మ్‌ స్టూడియోను కొనసాగిస్తూనే మరోవైపు డిజిటల్ లావాదేవిలపై అధిక దృష్టి సారిస్తామని ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ గ్రూప్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ), మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) జ్యోతి దేశ్‌పాండే తెలిపారు. ఇప్పటికే కంపెనీలో డిజిటల్ వాటా 25 శాతం కాగా, రాబోయే మూడేళ్లలో ఈ మొత్తం 75 శాతానికి చేరుతుందని అంచనా వ్యక్తం చేశారు. తమ దగ్గర 10,000 చిత్రాలు, మ్యూజిక్‌ వీడియోలున్నాయని, అసలైన చిత్రాలు డిజిటల్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు చిత్ర పరిశ్రమతో తమకున్న అనుబంధం ఉపయోగ పడుతుందని అన్నారు. అంతేకాదు వినోదంతో పాటు మహిళల అక్రమ రవాణాపై వీడియో సిరీస్‌ చిత్రాలు తీస్తామని, ప్రతినెలా కొత్త సిరీస్‌ విడుదల చేయాలన్నదే తమ లక్ష్యమని వెల్లడించారు. 2016లో చిత్రాలు తిలకించిన వారు 4 లక్షలతో మొదలైన వీక్షకుల సంఖ్య, ఇప్పుడు 37 లక్షలకు చేరిందన్నారు. త్వరలోనే మరో కొత్త డిజిటల్ సంస్థ ఇంటర్నెట్ లో రానుంది.