హైదరాబాద్ కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు

SMTV Desk 2017-06-16 12:44:46  Asia-Pacific, International level, Betting on Asia Pacific Knots Core Cities - June 2017, 63 world country

హైదరాబాద్ జూన్ 16 : భారతదేశంలో అతిచిన్న వయసున్న రాష్ట్రమైన తెలంగాణలోని హైదరాబాద్, ఆసియా- పసిఫిక్ దేశాల్లోని వాణిజ్య సముదాయాల పెట్టుబడి మార్కెట్లో ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ రంగంలో సింగపూర్, మలేషియా వంటి దేశాలను అధిగమించినట్లు కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. బెట్టింగ్ ఆన్ ఆసియా పసిఫిక్ నెక్ట్స్ కోర్ సిటీస్- జూన్ 2017 పేరిట విడుదల చేసిన ఈ నివేదికలో సుస్థిరమైన సంస్కరణలు, దీర్ఘకాలిక అభివృద్ధికి అపారమైన అవకాశాల కారణంగా హైదరాబాద్ నంబర్‌వన్ నగరంగా అవతరించిందని 63 ప్రపంచ దేశాల్లో వాణిజ్య కార్యకలాపాల్ని నిర్వహించే ఈ సంస్థ తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులకు ప్రోత్సాహకర వాతావరణాన్ని కల్పించడమే ఇందుకు ప్రధాన కారణమని సర్వేలో వెల్లడించారు. సర్వేలో ఆయా నగరాల ఆర్థిక స్థితిగతులు, రియల్ ఎస్టేట్ పరిస్థితులు, నష్టభయాలు..అనే మూడు అంశాలను పరిశీలించి ఆ ప్రాతిపదికన ర్యాంకులను నిర్ణయించారు. ఐటీ శాఖ మంత్రి విదేశీ నగరాల్లో పర్యటించి పెట్టుబడులను ఆహ్వానించడంతో పాటు ప్రభుత్వం అందజేస్తున్న ప్రోత్సాహకాలను అర్థమయ్యేలా వివరిస్తున్నారు. ఫలితంగా యాపిల్, ఊబర్, డీబీఎస్, బ్లాక్‌స్టోన్, ఎంబసీ, ఆర్‌ఎంజెడ్, ఐకియా, సామ్‌సంగ్ ఇప్పటికే హైదరాబాద్‌ను గమ్యస్థానంగా మార్చుకున్నాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్, వెల్స్‌ఫార్గో, జేపీ మోర్గాన్, డెలాయిట్ తమ కార్యకలాపాలను భాగ్యనగరంలో విస్తరిస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ నివేదికలో మొత్తం పది నగరాలను ఎంపిక చేయగా బెంగళూరు,ముంబై వంటి ఇతర భారతీయ నగరాలు ఆరు, ఏడు స్థానాల్లో పుణె,చెన్నై, ఢిల్లీ వంటివి ఎనిమిది,తొమ్మిది, పదో స్థానాల్లో ఉన్నాయి. మొదటి ఐదు నగరాల్లో హైదరాబాద్ మినహా మరే భారత నగరానికి చోటు దొరుకలేదు. ప్రథమ స్థానం హైదరాబాద్‌కు లభించగా బ్యాంకాక్(2), మనీలా(3), గ్వాంగ్‌హు(4), షెంజెన్(5) నగరాలకు తర్వాత స్థానాలు లభించాయి. హైదరాబాద్ ఎంచుకోగల ఏమిటంటే పెద్దనోట్ల రద్దు తర్వాత హైదరాబాద్ మార్కెట్ పెద్దగా దిద్దుబాటుకు గురి కాలేదు. పైగా ఇతర నగరాల నుంచి ఇక్కడికి వచ్చి పెట్టుబడులను పెట్టేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. తోటి మెట్రో నగరాలతో పోల్చితే ఇక్కడి జీవన విధానం మెరుగ్గా ఉంది. ఇండ్ల ధరలు అతితక్కువగా ఉన్నాయి. ఇలాంటి అనేక అంశాలు వచ్చే ఐదేండ్లలో హైదరాబాద్ సరికొత్త రీతిలో అభివృద్ధి చెందేందుకు భరోసా ఇస్తున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ నగరం టీఎస్-ఐపాస్‌కు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందడం గమనార్హం.