కందిపప్పుపై కౌశిక్ ప్రతిభ.. మిరాకిల్ అంటున్న.. మేరాకిల్ సంస్థ

SMTV Desk 2017-12-09 18:06:52  vijayawada, koushik micro artist, toordal micro artist.

విజయవాడ, డిసెంబర్ 09 : సముద్రమంతా సహనం..పదిగంటల ప్రయత్నం..ప్రతిభకు పదును ఇవన్నీ కలిసి ప్రపంచ రికార్డుగా మారాయి. ఇప్పటివరకు ఎవరు చేయని ప్రయత్నాన్ని విజయవాడకు చెందిన కౌశిక్ అనే బాలుడు చేశాడు. ఇంతకీ ఆ బాలుడు చేసిందేంటి అనుకుంటున్నారా...కందిపప్పు పై ఆంగ్ల అక్షరాలను చెక్కుతాడు. ఇతనికి చిత్ర కళ అంటే చాలా ఆసక్తి , ఇప్పుడు ఆ ఇష్టమే సూక్ష్మ చిత్ర కళపై మక్కువ పెంచింది. ఈ కళలో ఇప్పటి వరకు వివిధ కళాకారులు నెలకొల్పిన రికార్డుల గురించి కౌశిక్ తెలుసుకున్నాడు. తన పేరిట కూడా ఒక రికార్డు ఉండాలని గట్టి నిర్ణయించుకున్న ఈ బాలుడు కందిపప్పును ఎంచుకున్నాడు. జాతీయ గీతం, జనగణమనలోని 287 ఆంగ్ల అక్షరాలను తన లక్ష్యంగా నిర్దేశించుకుని విజయవాడకు చెందిన శివ అనే కళాకారుడి దగ్గర ఏడాది పాటు శిక్షణ తీసుకుని, కందిపప్పును ఆంగ్ల అక్షరాలుగా మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టాడు. ఆ అక్షరాలు కూడా 5 మి.మీటర్లు మించకుండా రికార్డు సృష్టించడమే ప్రధాన ఉద్దేశం. ఈ నెల 6న ఉదయం 10 గంటలకు తన పనిని ప్రారంభిన కౌశిక్ సుమారు 20 గంటల పాటు తన ప్రయత్నానికి సమయం పండుతుందని ప్రాధమికంగా నిర్ణయించుకున్నాడు. అయితే, తనకు ఉన్న లక్ష్యానికి ముందే కేవలం 10 గంటలలోనే అక్షరాలన్నీ చెక్కి రికార్డు సృష్టించాడు. ఈ సందర్భంగా ఆ బాలుడు మీడియా తో మాట్లాడుతూ.. ఒక్క దీనితోనే ఆగకుండా ఇంకా చాలా చేసి దేశానికి మంచి పేరు తేవాలని ఉన్నట్లు తెలిపాడు. తల్లిదండ్రులు కూడా ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా కౌశిక్ ను వారు చాలా ప్రోత్సహించారు. ఈ మేరకు అతని కౌశలానికి బ్రిటన్ కు చెందిన మేరాకిల్ సంస్థ సలాం కొట్టింది. అంతేకాకుండా ప్రపంచ స్థాయి గుర్తింపు ఇవ్వబోతుంది.