ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఉండవల్లి

SMTV Desk 2017-12-09 16:41:45  ap polavaram project, Former MP Undavalli Arun Kumar

ధవళేశ్వరం, డిసెంబరు 09 : ఏపీ రాష్ట్ర పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, లొసుగులు లేనప్పుడు శ్వేతపత్రం విడుదల చేయడానికి ఎందుకు జంకుతున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ప్రశ్నించారు. ఈ నెల 8న తూర్పుగోదావరిజిల్లా ధవళేశ్వరంలోని పోలవరం డిప్యూటీ ఎస్‌ఈ వెంకటేశ్వరరాజు కార్యాలయానికి విచ్చేసిన ఆయన సమాచార హక్కుచట్టం ద్వారా కొన్నిపత్రాలను పరిశీలించారు. అనంతరం ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ..ప్రాజెక్టు నిర్మాణంపై చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు జవాబుగా శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన మంత్రివర్గ నిర్ణయాలను సమాచార హక్కుచట్టం ద్వారా కోరానని తెలిపారు. తాను కోరిన సమాచారాన్ని ప్రభుత్వం నేరుగా అందించవచ్చని, కానీ అటుతిప్పి ఇటుతిప్పి ధవళేశ్వరం పోలవరం కార్యాలయానికి వెళ్లి పరిశీలించుకోవాలని సూచించడంతో కొన్ని ఫైళ్లను పరిశీలించానని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలోని అవకతవకలపై పూర్తి సమాచారంతో సోమవారం మీడియా ముందుకు వస్తానని ఆయన వెల్లడించారు.