వీడియో తీసిన వైద్యుడు అరెస్ట్...

SMTV Desk 2017-06-15 18:39:30  arrest, doctor, video, harresment, mumbai,

ముంబయి, జూన్ 15: మహిళలకు అడుగడుగునా ప్రమాదం పొంచివుంది అనేదానికి ముంబాయి లో జరిగిన ఓ సంఘటనే సాక్ష్యం. తోటి మహిళా వైద్యురాలిని అసభ్యకరంగా వీడియో తీసి తన స్నేహితులకు పంపిన ఘటన ముంబాయిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... వైద్యులు నివాసముండే క్వార్టర్స్‌లో ఓ మహిళా డాక్టర్‌ దుస్తులు మార్చుకుంటుండగా అదే అంతస్తులో ఉన్న 29 ఏళ్ల వైద్యుడు వీడియో తీశాడు. వీడియో తీయడమే కాకుండా దాన్ని తన స్నేహితులందరికీ చేరవేసాడు ఆ వైద్యుడు. దుస్తులు మార్చుకుంటున్న వీడియోను మహిళా డాక్టర్‌ స్నేహితురాళ్లు ఆమెకు చూపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురైంది. తొలుత ఈ విషయాన్ని ఆమె స్నేహితురాళ్లు చెప్పినపుడు నమ్మలేకపోయినా.. వీడియో చూశాక నిర్ఘాంతపోయింది. దీంతో వెంటనే ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై ఆరా తీయగా, చివరకు ఓ డాక్టర్‌ నుంచి వచ్చిందని తేలింది. దీంతో ఆమె ముంబయిలోని జుహూ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. 354, 379, 66ఏ, 67ఏ సెక్షన్ల కింద నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఈ ఘటనకు బాధ్యుడిగా భావిస్తున్న డాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే తాను ఎలాంటి వీడియోలు చిత్రీకరించలేదని ఆ డాక్టర్‌.. పోలీసులతో పేర్కొన్నట్లు తెలిసింది.