రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు దేశం ఘన నివాళి...

SMTV Desk 2017-12-07 11:26:15  br ambedkar, tribute, country, chaithyabhoomi, vip

న్యూ డిల్లీ, డిసెంబర్ 07: భారత రాజ్యాంగ నిర్మాత, స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రి డా. బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, ప్రజలు బుధవారం ఘనంగా నివాళులర్పించారు. పార్లమెంట్‌ హౌస్‌ ప్రాంగణంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, థావర్‌చంద్‌ గెహ్లోత్‌, కాంగ్రెస్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే లు పూలతో నివాళుర్పించారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ ద్వారా నివాళి అర్పించారు. పలువురు ప్రముఖులు, ప్రజలు ఈ సందర్భంగా అంబేద్కర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ కు రాజ్యాంగాన్ని అందించిన ఘనత దళితుడైన అంబేద్కర్ కు దక్కిందని పలువురు ప్రశంసించారు. న్యూ డిల్లీలో ఏర్పాటుచేసిన బీఆర్‌ అంబేడ్కర్‌ అంతర్జాతీయ కేంద్రాన్ని మోదీ గురువారం ప్రారంభించనున్నారు. ముంబయిలోని అంబేడ్కర్‌ స్మారక ప్రాంతమైన చైత్యభూమికి దేశం నలుమూలలనుంచి ప్రజలు తరలివచ్చి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్‌, గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావులు పాల్గొని రాజ్యాంగ నిర్మాతకు నివాళి అర్పించారు. ఆయన చూపిన మార్గం అందరికి ఆదర్శనీయమని పలువురు శ్లాఘించారు.