భూములు వద్దు నష్టపరిహారం ఇవ్వండి : కేకే

SMTV Desk 2017-06-15 15:56:03  Rajya Sabha member K. Kesava Rao, The controversial land,Revenue, government

హైదరాబాద్, జూన్ 15 : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం హఫీజ్‌పూర్ గ్రామంలో కొనుగోలు భూముల విషయంలో తాను తప్పుచేలేదన్నారు. రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ... వివాదాస్పద భూములకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో కొనుగోలును రద్దు చేసుకోవాలని కుటుంబసభ్యులకు సూచించానని తెలిపారు. ప్రభుత్వంకు సంబందించిన భూములపై తాము ఎలాంటి పోరాటం చేయబోమని ఆయన స్పష్టం చేశారు. కొనుగోలు చేసిన భూమికి సంబంధించి విక్రయాలను రద్దు చేసి తాము చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని విర్గో గ్లోబల్ మీడియా సంస్థకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిపారు. వివాదాస్పద భూములను తమకు అప్పగించడంతో తమ పరువుకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కోర్టు నోటీసు ద్వారా డిమాండ్ చేస్తామన్నారు. అన్ని రికార్డులు, కోర్టు ఆదేశాలు, ప్రభుత్వం ప్రచురించిన గెజిట్‌లో ప్రభుత్వమని లేకపోవడం, రెవెన్యూ, ప్రభుత్వ అధికారుల లేఖల ద్వారా సమాచారం తెలుసుకున్నాకే ఆ భూములు కొనుగోలు చేశామని వివరించారు. అయితే ప్రభుత్వం ఆ భూములను ప్రభుత్వ భూమిగా నిర్ధారిస్తున్నందున వాటిని వదులుకోవాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. ఆ భూములకు ఇప్పటి వరకు ఎలాంటి మ్యుటేషన్ జరుగలేదని తెలిపారు. ఈ సందర్భంగా భవిషత్తులో తాము ఆ భూముల జోలికి వెళ్ళమని స్పష్టం చేశారు.