తెలంగాణలోని మరో జిల్లాలో ఐటీ పరిశ్రమ

SMTV Desk 2017-06-15 14:46:04  Khammam District, Engineering and technology,IT industry, it hub, kammam

ఖమ్మం, జూన్ 15 : తెలంగాణ రాష్ర్టంలో రెండో జిల్లాలోని కేంద్రంలో ఐటీ పరిశ్రమను నిర్మిస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీ పరిశ్రమను ఇప్పుడు ఖమ్మం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇంజినీరింగ్, సాంకేతికవిద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఐటీ హబ్ టవర్ నిర్మాణానికి గురువారం రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కే తారక రామారావు శంకుస్థాపన చేయనున్నారు. ఖమ్మం నగరంలోని ఇల్లందు క్రాస్ రోడ్డులోని 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.25 కోట్ల అంచనా వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించబోతున్నారు. ఐటీ హబ్ నిర్మాణానికి మొదటి విడుత రూ.12.50 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఏడాదిలో భవన నిర్మాణం పూర్తిచేసి వినియోగంలోకి తీసుకొచ్చేలా అధికారులు ప్రణాళిక రచించారు. గతంలో ఖమ్మం పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్‌కు ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ఈ ప్రాంతంలో భవన నిర్మాణం చేయాలని కోరారు. మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఆమోదం తెలిపారు. ప్రతి ఏటా ఇతర దేశాలకు ఐటీ ఉద్యోగాల కోసం వెళ్లేవారి సంఖ్య హైదరాబాద్ తర్వాత ఖమ్మం జిల్లాదే అధికం అవుతుందన్న ఉద్దేశంతో ఖమ్మంలో ఐటీ పరిశ్రమ నెలకొల్పితే ఇతరప్రాంతాలకు వలసవెళ్లే అవకాశం లేకుండాపోతుంది. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే అజయ్ ప్రోత్సాహంతో ఖమ్మంలో వ్యాపార లావాదేవీలు నిర్వహించేందుకు 15 అమెరికా కంపెనీలు ముందుకొచ్చాయి. ఖమ్మం జిల్లాకు ఐటీ హబ్ రావడంపై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగిస్తారు. ఈ సభలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొంటారు.