గన్నవరంలో ఈ నెల నుంచి ప్రారంభం కానున్న కార్గో సేవలు

SMTV Desk 2017-12-05 10:55:51  gannavaram airport, Cargo services, krishna dist

కృష్ణా, డిసెంబర్ 05 : కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి మూడు జిల్లాల్లోని వ్యవసాయ, ఆక్వా, మాంస ఉత్పత్తుల ఎగుమతికి గన్నవరం విమానాశ్రయంలోని కార్గో సేవలు కీలకంగా నిలవనున్నాయి. మూడున్నర దశాబ్దాల కిందటే గన్నవరం విమానాశ్రయం నుంచి విదేశాలకు మాంస ఉత్పత్తులను ఎగుమతి చేసేవారు. అప్పట్లో గన్నవరంలో ఉండే బేకన్‌ ఫ్యాక్టరీ మాంస ఉత్పత్తులను విదేశాలకు ఇక్కడి నుంచి తీసుకెళ్లేవారు. గన్నవరం విమానాశ్రయం నుంచి సరకు రవాణా విమానాలు(కార్గో సేవలు) నడిపేందుకు అవసరమైన అనుమతుల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. శంషాబాద్‌ విమానాశ్రయంలో కార్గో సేవలు అందించే శ్రీపా లాజిస్టిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఇక్కడా ఎంపికైంది. దీంతో కార్గో భవనంతో సహా అన్ని ఏర్పాట్లూ పూర్తయి, గత జులై నుంచే సేవలు అందించాలని భావించారు. అయితే, కీలకమైన బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ(బీసీఏఎస్‌) నుంచి భద్రతా పరమైన అనుమతుల మంజూరుకు సమయం పట్టగా, పోలీస్‌ కమిషనరేట్‌, కలెక్టరేట్‌ సహా అన్ని అనుమతులూ బీసీఏఎస్‌కు వెళ్లిపోయాయి. దీంతో ఈ వారంలో బీసీఏఎస్‌ నుంచి కార్గో సేవలకు అవసరమైన అనుమతులను ఇవ్వనున్నారు. ఈ నెలలోనే ప్రారంభించనున్నారు.