పేదల భూమి కాదు: శ్రీనివాస్

SMTV Desk 2017-06-15 13:25:13  Medchal mandalam Girmapur, Survey 221Graduation is a land,Rajya Sabha member D.Srinivas

రంగారెడ్డి, జూన్ 15 : తెలంగాణలో రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌ మండలం గిర్మాపూర్‌లోని సర్వేనంబరు 221లో తాను కొనుగోలు చేసిన 4 ఎకరాల భూమి ప్రభుత్వ అసైన్డ్‌ భూమి కాదని ఇది పట్టా భూమేనని రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ తెలిపారు. పేదలకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్‌ భూమిని తాను రిజిస్టర్‌ చేయించుకున్నట్లు వచ్చిన కథనాలు నిజం కాదన్నారు. గిర్మాపూర్‌లో భూమి కొనుగోలుకు ముందు 57 ఏళ్ల రికార్డులను పరిశీలించానని, అవన్నీ రైతుల పట్టాభూములుగానే రికార్డులలో ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ గ్రామంలో సర్వేనంబరు 221లో 4 ఎకరాలు, సర్వేనంబరు 231లో 0.13 ఎకరాలను పట్టాదారుల నుంచి 2015లో కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. 1960 నుంచి ఇవి పట్టా భూములుగానే రికార్డుల్లో ఉన్నాయన్నారు. తలారీ పోచయ్య అనే వ్యక్తి ఈ భూమి హక్కుదారునిగా 1961-62లో పహాణీలో పట్టా భూమిగా నమోదైందన్నారు. 221 సర్వేనంబరు లోని 8-19 ఎకరాలను పోచయ్య నుంచి బొక్కా యాదగిరి రెడ్డి అనే వ్యక్తి 1994లో కొనుగోలు చేశారని చెప్పారు. పహాణీల్లో కూడా ఇలానే ఉందన్నారు. తరువాత కాలంలో ఆయన సోదరుడు బొక్కా రాజిరెడ్డి పేరు మీద ఈ భూమి మ్యుటేషన్‌ అయ్యిందని తెలిపారు. అప్పటి నుంచి రికార్డుల్లో వీరు పేరు కొనసాగిందన్నారు. బొక్కా రాజిరెడ్డి వారసులు బొక్కా సాయిరెడ్డి, బొక్కా బల్వంతరెడ్డి, బొక్కా రఘపతి రెడ్డిలు ఈ భూమిపై విరాసత (వారసత్వపు హక్కులు) తీసుకున్నట్లు తెలిపారు. తాను ఈ నాలుగెకరాల భూమిని సాయిరెడ్డి, బల్వంత్‌రెడ్డి, రఘుపతిరెడ్డిల నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు. దీనికి సంబంధించి 2.34 ఎకరాలకు 1998లో జారీ అయిన పట్టాదారు పాస్‌పుస్తకాలు కూడా ఉన్నాయన్నారు. రిజిస్ట్రేషన్‌శాఖ వద్ద కూడా ఈ భూముల సర్వేనంబర్లు నిషేధిత జాబితాలో లేవన్నారు. ఈ రికార్డులన్నీ పరిశీలించిన తర్వాతే తాను భూములను కొనుగోలు చేశానన్నారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా ఇలాంటి కథనాలను రావడం తనకు ఎంతో ఆవేదనకు గురిచేసిందని ఆయన వెల్లడించారు.