బీసీల సంక్షేమానికి సమగ్ర నివేదిక సమర్పించండి : కేసీఆర్

SMTV Desk 2017-12-04 10:45:22  bc welfare association, cm kcr, telangana government.

హైదరాబాద్, డిసెంబర్ 04 : బీసీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. వారి సమస్యలను పరిష్కరించడంతో పాటు రాబోయే తరానికి మార్గదర్శకంగా ఉండేలా విధివిధానాలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ విషయంపై శాసనసభలో చర్చించి నిర్ణయాలను అమలు చేసేందుకు తీర్మానాలు, చట్టాలు, జీవోలు, నిబంధనలు తెస్తామని వెల్లడించారు. బీసీల సమస్యలపై సమీక్ష నిర్వహించిన కేసీఆర్ ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "బీసీల అభ్యున్నతి కోసం రాష్ట్ర పరిధిలో అన్ని అంశాలపై సానుకూల నిర్ణయాలు తీసుకుంటాం. బీసీల సంక్షేమానికి కొత్త పథకాలు, కార్యక్రమాలు గూర్చి సూచించండి. అన్ని కుల సంఘాలతో మాట్లాడి, అందరి అభిప్రాయాలు తీసుకొని నివేదిక సమర్పించండి. అంశాలపై స్పష్టత వచ్చాక శాసనసభలో ఒక రోజు చర్చించి, విధానపరమైన నిర్ణయాలు తీసుకుందాం. ప్రభుత్వ లబ్ధిపైనా కొన్ని కులాల మధ్య ఘర్షణలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి అన్ని విషయాల్లో ఆచరణీయమైన మార్గాన్ని ప్రజాప్రతినిధులు సూచించాలి. సమున్నత లక్ష్యం కోసం సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. ఆత్మన్యూనతతో కాదు అందరూ ఆత్మవిశ్వాసంతో బతకాలి" అని వెల్లడించారు.