‘ఫ్రీడం 251’ మళ్లీ రానుందా...?

SMTV Desk 2017-12-03 22:36:02  freedom 251, smart phone, ringing bells, goyal.

నోయిడా, డిసెంబర్ ౦4 : గత సంవత్సరంలో మొబైల్ కంపెనీలకు దడ పుట్టించిన ‘ఫ్రీడం 251’ ఫోన్ గుర్తుందా...? ప్రపంచంలోనే అతి తక్కువ (రూ.251కే) ధరకే స్మార్ట్ ఫోన్ ను రింగింగ్‌ బెల్స్‌ సంస్థ అందిస్తామనడంతో అది ఒక సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. రింగింగ్‌ బెల్స్‌ ఎండీ మోహిత్‌ గోయల్‌ అనూహ్యంగా మరో ప్రకటన చేశారు. ప్రభుత్వం తనకు సహకారం అందిస్తే వచ్చే ఏడాదిలో మళ్లీ తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. తాజాగా ఈ ఫోన్ కి సంబంధించిన కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. రింగింగ్‌ బెల్స్‌ సంస్థ నుండి ఫోన్ తయారు చేస్తామని డబ్బులు తీసుకోని మోసం చేసిన, వికాస్ శర్మ, జీతూను అరెస్ట్‌ చేసి దస్నా జైలుకు తరలించారు. ఈ అరెస్ట్ నేపధ్యంలో ఓ న్యూస్‌ ఏజెన్సీతో మోహిత్‌ మాట్లాడుతూ "మా సంస్థ నుండి ఇద్దరికి సుమారు రూ.3.5కోట్లు చెల్లించాను. వారు ఫోన్లు అందజేయాల్సి ఉన్నా, ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొంత మంది డిస్ట్రిబ్యూటర్లు ఫోన్లు సరఫరా చేయని కారణంగా నాపై కేసు వేశారు. దీంతో నేను ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాను. ప్రస్తుతం వారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నేను కేంద్రం ప్రకటించిన ‘మేకిన్‌ ఇండియా’ నినాదానికి కట్టుబడి ఉన్నాను. ప్రభుత్వం సహకారం అందిస్తే ఫోన్‌ను ఇస్తాను. ప్రస్తుతం కొన్ని పెద్ద కంపెనీలు నా ఫోన్ మోడల్ ని అనుకరించి తక్కువ ధరలకే స్మార్ట్ ఫోన్ లు అందిస్తున్నాయి. అంత తక్కువ ధరకు వారెలా అందిస్తున్నారని ప్రజలు ఎందుకు ప్రశ్నించడం లేదు...?" అని చెప్పుకొచ్చారు.