అమెరికా పై ఉత్తరకొరియా తీవ్ర ఆగ్రహం

SMTV Desk 2017-12-03 17:27:32  america, utharakouriya, white house

సియోల్, డిసెంబర్ 03 ‌: దాదాపు రెండు నెలల విరామం తర్వాత ఉత్తరకొరియా బుధవారం హ్వాసంగ్‌-15 క్షిపణిని ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ క్షిపణి ప్రయోగాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో పాటు దక్షిణకొరియా, జపాన్‌, రష్యా దేశాలు తీవ్రంగా ఖండించాయి. అమెరికా-దక్షిణ కొరియా సైన్యం సంయుక్త విన్యాసాలపై ఉత్తరకొరియా కొరియా అధికార పార్టీ పత్రిక రొడాంగ్‌ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దక్షిణకొరియా, అమెరికా సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేపట్టనుండటంపై ఉత్తరకొరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రెచ్చగొట్టే చర్యలతో ట్రంప్‌ ప్రభుత్వం అణుయుద్ధం కావాలని అడుక్కుంటుందని ఉ.కొరియా తన కథనంలో పేర్కొంది. క్షిపణి ప్రయోగాలు చేయడం ఆపకపోతే యుద్ధానికి దిగాల్సి వస్తుందని శ్వేతసౌధం జాతీయ భద్రత సలహాదారులు హెచ్‌ఆర్‌. మెక్‌మాస్టర్‌ ఉత్తరకొరియాకు వార్నింగ్‌ వచ్చిన మరుసటి రోజే ఆ దేశం ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. డీపీఆర్‌కె(ఉ.కొరియా)ను రెచ్చగొడితే ఏ క్షణానైనా అణుయుద్ధానికి దిగే అవకాశం ఉంది. డీపీఆర్‌కెను లక్ష్యంగా చేసుకొని యూఎస్‌-కొరియా విన్యాసాలు చేపట్టి వారి నాశనాన్ని వాళ్లే కొనితెచ్చుకుంటున్నారు. ఈ మేరకు ఉ.కొరియాతో యుద్ధం చేయాల్సి వచ్చే పరిస్థితులు త్వరలోనే రానున్నట్లు అనిపిస్తుందని, మెక్‌మాస్టర్‌ వ్యాఖ్యలు చేశారు.