ప్రాణం తీసిన ప్రేమ

SMTV Desk 2017-12-03 10:56:29  lovers suicide, ponduru, pawan kalyan, renuka, srikakulam

పొందూరు, డిసెంబర్ ౦3 : ప్రాణంగా ప్రేమించుకున్నారు... పెళ్లి చేసుకుందామని ఒప్పంద పత్రం రాసుకున్నారు... కానీ ఏమైందో తెలియదు... క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయంతో తమ ప్రాణాలు తీసుకున్నారు. జిల్లాలోని పొందూరు మండలంలోని కనిమెట్టకు చెందిన అన్నెపు పవన్‌ కల్యాణ్‌ (17), మొదలవలసకు చెందిన మొదలవలస రేణుక(17) కింతలి రెవెన్యూ పరిధిలోని మామిడి తోటల్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కింతలి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పవన్‌కల్యాణ్, రేణుక ఇంటర్‌ హెచ్‌ఈసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వీరు చాలా రోజులుగా ప్రేమించుకుంటున్నారు. అయితే నిన్న కళాశాలకు వెళ్లిన వీరివురు ఇళ్లకు రాకపోవడంతో కలత చెందిన తల్లిదండ్రులు ఆందోళనకు లోనయ్యారు. కుటుంబ సభ్యులు, స్థానికులు ఎంత వెతికినప్పటికి ఆచూకీ కానరాలేదు. చివరకు మామిడి తోటలో వీరు ఉరేసుకుని చనిపోయారనే వార్త విని హతాశులయ్యారు. అంతే కాకుండా రేణుక, పవన్‌ కల్యాణ్‌ ఇరువురు ఒక ఒప్పంద పత్రం రాసుకున్నారు. ఇంటర్మీడియట్‌ పూర్తయిన తర్వాత చదువుకోవడానికి ఐదేళ్లు విడిచి వెళ్లేందుకు రేణుక గడువు కోరింది. ఇందుకు పవన్‌ కూడా అంగీకరించాడు. మళ్లీ 2022 ఫిబ్రవరిలో కలుస్తానని చెప్పాడు. ఒక నమూనా పెళ్లి శుభలేఖను కూడా రాసుకున్నారు. వీరు మృతితో ఇరువురి కుటుంబాల్లో, గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.