పదవుల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం: చంద్రబాబు

SMTV Desk 2017-12-02 12:28:07  chandrababu, polavaram, positions, tdlp meeting, bjp

అమరావతి, డిసెంబర్ 02: ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పునరుధ్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పడడం తమ ఉద్దేశం కాదని, కేంద్రీకృత సమాఖ్య వ్యవస్థలో సహకార౦తో ముందుకు పోతామని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ టెండర్లు నిలిపివేయాలని కేంద్రం నుంచి వచ్చిన లేఖతో ఘాటుగా స్పందించిన చంద్రబాబు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. టీడీఎల్పీ సమావేశం నిర్వహించి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. కేంద్రం, బీజేపీ పై ఆచితూచి స్పందించాలని, వివాదాలకు తావు ఇవ్వవద్దని ఆయన నాయకులను కోరారు. తాము పదవుల కోసం ఎప్పుడూ వెంపర్లాడలేదని రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. గతంలో మాజీ ప్రధాని వాజ్ పేయి ఏడు మంత్రి పదవులు ఇస్తామని ఆఫర్ ఇచ్చినా తాము తీసుకోలేదని, కేంద్రంతో మంచి సంబంధాల కోసం అప్పట్లో బాలయోగికి స్పీకర్ పదవి తీసుకున్నామని ఆయన తెలిపారు. ఇప్పుడు కేంద్రంలో తమ ఎంపీలు ఇద్దరు మంత్రులుగా ఉండడం కూడా కేంద్రంతో సత్సంబంధాల కోసమేనని ఆయన మీడియాకు వివరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో రాజీ పడబోమని సీఎం ఉద్ఘాటించారు.