దేవుడికీ తప్పని జీఎస్టీ

SMTV Desk 2017-06-14 17:34:31  Tirupathi,GST,TTD,supreem court,vat Act

తిరుమల, జూన్ 14 : భక్తుల దగ్గర వడ్డీని వసూలు చేసే తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారు నాటి కాలంలో కుబేరుని దగ్గర అప్పు తెచ్చినందులకు నేటికి అది తీరలేదని చెబుతుంటారు. అది తీరకముందే మరో పన్నును కేంద్రప్రభుత్వం తీసుకొస్తోంది. అయితే దానిని చెల్లించేందుకు సిద్దంగా ఉండమని . జూలై ఒకటో తేదీ నుండి అమల్లోకి రానున్న వస్తు సేవల పన్ను(జీఎస్టీ) విధానం ఈ కొత్త నిర్వచనాన్ని ఎత్తిచూపుతోంది. దేశంలోనే అతిపెద్ద హిందూ ధార్మికసంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై వస్తుసేవల పన్ను (జీఎస్టీ) పెనుభారం మోపనుంది. ఇప్పటికే ఉచిత, సబ్సిడీ లడ్డూ, నిత్యాన్నప్రసాద వితరణతో ఆర్థిక భారాన్ని మోస్తున్న ధార్మికసంస్థపై కొనుగోళ్లు, రాబడి వసూళ్లపై జీఎస్టీ భారం మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. 2003లో సుప్రీంకోర్టు విధి విధానాల ప్రకారం అమల్లోకి వచ్చిన వ్యాట్‌ పన్ను చట్ట ప్రకారం మతపరమైన ధార్మిక సంస్థలకు మినహాయింపు వచ్చింది. కానీ జీఎస్టీలో మత పరమైన సంస్థలకు ఎలాంటి మినహాయింపు ఇవ్వకపోవడం గమనార్హం. కేవలం ప్రసాదాల అమ్మకం మినహా ఇతర రాబడి వసూళ్లపై పన్నుభారం మోయకతప్పదని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. భక్తులు ప్రీతిపాత్రంగా స్వీకరించే లడ్డూ తయారీకి టీటీడీకి రూ.35 పైబడి ఖర్చవుతోంది. అయితే, భక్తులకు రూ.25 చొప్పునే విక్రయిస్తోంది. అందులోనూ కాలిబాటలో నడిచివచ్చే భక్తులకు ఒకరికి ఒక లడ్డూ ఉచితంగా అందిస్తోంది. ఇక వీరితోపాటు సర్వదర్శనం భక్తులకూ సబ్సిడీ ధరతో రూ.10 చొప్పున రెండేసి లడ్డూలు అందజేస్తోంది. ఈ నేపథ్యంలో లోటును పూడ్చుకునేందుకు భక్తులపై భారం వేయాలా? సబ్సిడీ ఎత్తేయాలా? అన్న ఆలోచనలో టీటీడీ ఉన్నతాధికారులు ఉన్నారు.